బాలీవుడ్ లో ఓ ప్రక్క డ్రగ్స్ కేసు ప్రకంపనలు రేపుతుండగా, దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై హీరోయిన్ పాయల్ ఘోష్ చేసిన లైంగిక వేధింపు ఆరోపణలు సంచలనంగా మారాయి. అనురాగ్, గదిలో తనపై లైంగిక దాడికి ప్రయత్నించారని పాయల్ ట్విట్టర్ లో షాకింగ్ పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియా ద్వారా ఈ ఆరోపణలను అనురాగ్ ఖండించారు. పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలలో ఎటువంటి నిజం లేదని ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. ఈ వ్యవహారంలో అనురాగ్ కి కొందరు బాలీవుడ్ ప్రముఖులు మద్దతు తెలిపారు. 

కాగా అనురాగ్ కశ్యప్ మాజీ భార్యలు కల్కి కొచ్లిలిన్, ఆర్తి బజాజ్ ఆయనకు మద్దతుగా నిలిచారు. సోషల్ మీడియా ద్వారా ఆడవారి పట్ల అనురాగ్ ప్రవర్తనా తీరు, ఉన్నత ఆలోచనలు తెలియజేశారు. పాయల్ వి దిగజారుడు ఆరోపణలు అని దుయ్యబట్టారు. 

అనురాగ్ మొదటి భార్య ఆర్తి బజాజ్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో అనురాగ్ ని ఓ రాక్ స్టార్ అని వర్ణించారు. ఆడవాళ్ళకు భద్రతతో కూడిన వాతావరణాన్ని రూపొందించి, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడ్డావు. కానీ ఈ లోకం స్వార్ధపరులు, పనికిరానివాళ్ళు, మూర్ఖులతో నిండిపోయింది. నీపై ఇలాంటి ఆరోపణలు రావడం భాధాకరం. ఇప్పటివరకు నేను చూడని చీపెస్ట్ స్టంట్ ఇది అని ఆమె పోస్ట్ పెట్టారు. 

ఇక అనురాగ్ రెండవ భార్య కల్కి కొచ్లిలిన్ సైతం అనురాగ్ స్వభావాన్ని ఉన్నతంగా చెప్పడం జరిగింది. అనురాగ్ ని ఒక ఫెమినిస్ట్ గా చెప్పిన కల్కి, తన సినిమాల ద్వారా ఆడవాళ్ళ అభివృద్ధి కోసం పోరాడినట్లు చెప్పడం విశేషం. అర్థంపర్థం లేని సోషల్ మీడియా కామెంట్స్ గురించి కూడా పట్టించుకోను అని ఆమె చెప్పారు. 

అలాగే హీరోయిన్ తాప్సి సైతం అనురాగ్ కశ్యప్ కి అండగా నిలిచారు. సోషల్ మీడియా ద్వారా ఆయన వ్యక్తిత్వాన్ని పొగిడారు. తన దృష్టిలో అనురాగ్ ఒక స్త్రీ పక్షపాతి, ఆడవాళ్ళను తన క్రియేటివిటీ ద్వారా ఉన్నతంగా చూపినట్లు, ఆయనతో మరోమారు వర్క్ చేయాలని భావిస్తున్నట్లు తాప్సి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 

మరో నటి రాధికా ఆప్టే సైతం అనురాగ్ పట్ల ఉన్నత భావాలు వ్యక్తపరిచింది. తన అత్యంత ఆప్త మిత్రుడిగా రాధికా అనురాగ్ ని చెప్పడంతో పాటు, అతని సాంగత్యంలో చాల భద్రతగా ఫీలవుతున్నాను. ఎప్పటికీ నమ్మదగిన మిత్రుడిగా రాధికా దర్శకుడు అనురాగ్ గురించి చెప్పడం జరిగింది.