హైదరాబాద్ లో ఇటీవల పట్టుబడ్డ డ్రగ్స్ మాఫియా నిందితులు విచారణలో వెల్లడిస్తున్న విషయాలు సినీ పరిశ్రమను కుదిపేస్తున్నాయి. డ్రగ్స్ మాఫియా కొంత మంది టాలీవుడ్ సెలెబబ్రిటీలకు కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్లు తేలింది. తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి దాదాపు 20 మందికి పైగా డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకున్నారు. వారిలో ఒక్కొక్కరికి సిట్ నోటీసులు పంపుతోంది.

 

తాజాగా సిట్ సేకరించిన ఆధారాల ప్రకారం ముగ్గురు యువ హీరోలు, నలుగురు దర్శకులు, ఇద్దరు నిర్మాతలు, కొందరు ఫైట్ మాస్టర్లకు నోటీసులు జారీ చేశారు. వీరంతా ఆరు రోజుల్లో విచారణకు హాజరుకావాలని, లేకపోతే చర్యలు ఉంటాయని సిట్ వెల్లడించింది.

 

ఇక సినీ పరిశ్రమలో కొంత మంది డ్రగ్స్ మహమ్మారి బారిన పడిన మమాట వాస్తవమేనని సినీ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు తదితరులు అంగీకరించారు. అయితే భవిష్యత్తులో డ్రగ్స్ బారిన పడకుండా సినీ పరిశ్రమకు చెందిన వారిని కాపాడుకుంటామని నిర్మాతలు వెల్లడించారు.పరిశ్రమలో ఎవరెవరు ఏం చేస్తున్నారో అంతా పోలీసుల వద్ద సమాచారం వుందని, భవిష్యత్తును నాశనం చేయొద్దనే ఉద్దేశంతోనే వారి వివరాలు బయటపెట్టడం లేదని నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అర్జున్ అన్నారు. పరిశ్రమలో వుండి ఇలాంటి పనులు చేయటం తగదని, అంతగా డ్రగ్స్ కావాలంటే పరిశ్రమను వీడి వెళ్లిపోవాలని అల్లు అరవింద్ స్పష్టం చేశారు.

 

ఇక 30వేల మంది దాకా కార్మికులు పనిచేసే తెలుగు సినీ పరిశ్రమలో కేవలం పది పదిహేను మంది మాత్రమే డ్రగ్స్ వినియోగిస్తున్నారని, ఇలాంటి వాళ్ల వల్లే మొత్తం పరిశ్రమకు చెడ్డ పేరు వస్తోందని మా అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. సినీ పరిశ్రమ డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తుందని ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వర్ రావు అన్నారు.