కథ

సాధారణంగా దొంగలని పోలీసులు పట్టుకున్నప్పుడు ...వాళ్లు దోచుకున్న డబ్బుని స్వాధీనం చేసుకుని లాకర్ లో పెట్టి ఆ తర్వాత కోర్ట్ లో సబ్ మిట్ చేస్తూంటారు. అదే పద్దితిలో హేమగిరి పోలీస్ లు కూడా ఓ దొంగల గ్యాంగ్ నుంచి దోచుకున్న డబ్బుని తమ స్టేషన్ లో లాకర్ లో పెడతారు. కానీ చిత్రంలో కోర్ట్ లో సబ్ మిట్ చేద్దామని ఉదయం చూసేసరికి ఆ లాకర్ ఖాళీగా ఉంటుంది. ఏకంగా పోలీస్ స్టేషన్ కు అంత ధైర్యంగా వచ్చి..స్టాఫ్ ఉండగానే దొంగతనం చేసిందెవరు. అదెలా సాధ్యం..ఎవరి ఆలోచనలకీ అంతు పట్టదు. ఆ విషయం బయిటకు చెప్తే పరువు పోతుంది..ఉద్యోగాలు పోతాయి. పోలీస్ లు వణికిపోతూంటారు. ఆ క్రమంలో వారికి ఓ డిటెక్టివ్ అవసరం అవుతాడు. అప్పుడే కొత్తగా పోలీస్ స్టేషన్ లో సెంట్రీ జాబ్ లో జాయిన్ అయిన దివాకర్‌(రిషబ్‌ శెట్టి) పై వారి దృష్టి పడుతుంది. 

ఎందుకంటే దివాకర్ కి చిన్నప్పటి నుంచి జేమ్స్‌ బాండ్‌ నవలలు, డిటెక్టివ్‌ నవలలంటే పిచ్చ ఇష్టం. పెద్ద డిటెక్టివ్‌ అవ్వాలనే జీవితాశయం పెట్టుకుని పెరుగుతాడు. ఓ మిస్సింగ్ కేసు పరిష్కరించటంలో  అతని తెలివి తేటలను చూసిన పై అధికారులు...నమ్మి దివాకర్ కు ఈ దొంగతనం కేసు అప్పగిస్తారు. చాలా చిత్రమైన ఈ కేసుని దివాకర్‌ ఎలా పరిష్కరించాడు? ఈ క్రమంలో ఎదురైన ట్విస్ట్ లు ఏంటి? ఫైనల్ గా పోలీసులకు తెలియకుండానే అదీ పోలీస్‌స్టేషన్‌లో ఎవరు దొంగతనం చేసారో అలా కనుక్కుంటాడు..అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉంది

ఈ సినిమా అందం అంతా రెట్రో ఫిల్మ్ గా దీన్ని 80లలో జరుగుతున్నట్లు తీర్చిదిద్దటంలోనే ఉంది. అలాగే ఈ సినిమాలో మరో స్పెషాలిటీ ఏమిటి అంటే దాదాపు ప్రధాన పాత్రలు మాట్లాడే మాటల్లో దాదాపు కథకు సంభందించిన కేసు గురించే ఉంటాయి. ప్రక్కకు వెళ్లనీయడు డైరక్టర్ మన దృష్టిని. చిన్న చిన్న క్లూలు వదులుకుంటూ మనని సైతం ఓ పజిల్ సాల్వ్ చేస్తున్న ఫీల్ తీసుకువస్తాడు. మనం ఊహించే కొన్ని ట్విస్ట్ లు సైతం భలే డీల్ చేసాడురా అని డైరక్టర్ ని మెచ్చుకోకుండా ఉండలేం. ఓ  ప్రక్కన డాట్స్ కలుపుతూ ముందుకు వెళ్ళటం..అదే సమయంలో ఒక్కో అనుమానితిడుని ప్రక్కకు తప్పించటం రెండూ సమాంతరంగా జరుగుతూంటాయి. ఇది స్క్రిప్టు సాధించిన సక్సెస్. క్లైమాక్స్ , ప్రీ క్లైమాక్స్ సినిమాకు ప్రాణంగా నిలిచాయి.

 స్క్రిప్టులోకి క్యారక్టర్స్ వచ్చి చేరి ఇమిడిపోయాయి. అయితే ఫస్టాఫ్ మనకు కన్నడ ఆర్టిస్ట్లు పరచయం లేకపోవటంతో కాస్తంత ఇబ్బందిగా ఉంటుంది. అలాగే తండ్రికి, కొడుకుకి జరిగే ట్రాక్ సైతం మరీ లెంగ్త్ గా అనిపిస్తుంది. దాని పర్పస్ క్లైమాక్స్ లో అర్దమైనా..అంత పెద్ద ట్రాక్ ట్రిమ్ చేస్తే బాగుండేది. అలాగే అవకాశం ఉన్న చోటల్లా ఫన్ ని యాడ్ చేయటం బాగా ప్లస్ అయ్యింది. అయితే హీరో,హీరోయిన్ ట్రాక్ అంత ఇంప్రెసివ్ గా ఉండదు. అది నిజానికి సినిమాకు అనవసరం కాబట్టి పట్టించుకోవాల్సిన పని కూడా లేదు. ప్లాంటింగ్ అండ్ పే ఆఫ్ అనే స్క్రీన్ ప్లే సూత్రాన్ని ఇంతలా వాడుకున్న స్క్రిప్టు ఈ మధ్యకాలంలో ఇదేనేమో. 

టెక్నికల్ గా..

అరవింద్ కాశ్యప్ కెమెరా వర్క్ మెచ్చుకోదగ్గ స్దాయిలో ఉంటుంది. కెమెరా కూడా కథ గురించి కొన్ని క్లూలు ఇస్తూంటుంది. మనకు హీరో పాత్ర  'పింక్‌ పాంథర్‌'  సీరిస్ లోని పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జాక్వస్‌ క్లూసెయు గుర్తుకు తెస్తాడు. అయితే కేవలం అది చూపులకే పరిమితం చేసారు. పాత్రను కాస్త తెలివిగా డిజైన్ చేసారు. హీరోయిన్ హరిప్రియ...కుసుమగా ఫెరఫెక్ట్ గా నటించింది. మిగతా విభాగాలు కూడా బాగానే సపోర్ట్ చేసాయి. పాటలు సోసోగా ఉన్నాయి. ఎడిటింగ్ లాగ్ లేకుండా నీట్ గా ఉంది. డైరక్టర్ కు మంచి బడ్జెట్ ఇస్తే దుమ్ము దులిపేలా ఉన్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్ ..కన్నడ పరిశ్రమకు తగినట్లు ఉన్నాయి. 

ఫైనల్ థాట్
చాలా సార్లు 'ఓటీటి' లో మన డైరక్ట్ తెలుగు సినిమాల కన్నా ప్రక్క రాష్ట్రాల డబ్బింగ్ లే బాగుంటున్నాయి.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 2.5

ఎవరెవరు..
నటీనటులు: రిషబ్‌ శెట్టి, హరిప్రియ, అచ్యుత్‌కుమార్‌, యోగరాజ్‌ భట్‌ తదితరులు
సంగీతం: అజనీశ్‌ లోకనాథ్‌
సినిమాటోగ్రఫీ: అరవింద్‌ కశ్యప్‌
ఎడిటింగ్‌: కె.ఎం.ప్రకాశ్‌
కథ: దయానంద్‌ టి.కె.
నిర్మాత: సంతోష్‌ కుమార్‌ కె.సి.
దర్శకత్వం: జయతీర్థ
విడుదల: ఆహా ఓటీటీ