బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో సినీ పరిశ్రమ షాక్‌కు గురైంది. ముంబై, బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రాథమికంగా పోలీసులు నిర్థారించారు. తన రూమ్‌లోని ఫ్యాన్‌కు సుశాంత్‌ ఉరి వేసుకొని ఉండగా ఇంటి పని మనిషి చూసి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. అయితే సుశాంత్ రూంలో ఎటువంటి సుసైడ్ నోట్ లభించలేదని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బంధువు సంచలన ఆరోపణలు చేశారు. పాట్నాలో నివాసం ఉంటున్న సుశాంత్ సింగ్‌ దగ్గరి బంధువు యువ నటుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తలను ఖండించారు. సుశాంత్ అంకుల్ ఆర్‌ సీ సింగ్ నవభారత్‌ టైమ్స్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుశాంత్ ఎంతో ధైర్యవంతుడని, ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడని కాదని ఆయన చెప్పారు.

అంతేకాదు ఇటీవల మరణించిన సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్‌ దిశ సలైన్‌ను కూడా ఎవరో హత్య చేశారని, దానికి కొనసాగింపుగానే సుశాంత్‌ను కూడా హత్య చేసిన ఉంటారని ఆయన ఆరోపించారు. సుశాంత్ మృతదేశాన్ని పోస్ట్‌మార్టమ్‌ కోసం కూపర్‌ హాస్పిటల్‌కు తరలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.