ఇన్నాళ్ళు రైటర్స్, దర్శకులు సృష్టించిన పాత్రలను పోషించానని, మొదటిసారి రియల్‌ లైఫ్‌ పాత్రలో నటించానని, అది మర్చిపోలేని అనుభూతినిస్తోంది. అంతే కాదు నాకు గత జ్ఞాపకాలను గుర్తు చేసిందని అంటున్నారు హీరో సూర్య. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం `ఆకాశం నీ హద్దురా`. సుధా కొంగర ప్రసాద్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్‌ 12న అమేజాన్‌ ప్రైమ్‌ ద్వారా విడుదల కానుంది. ఈ సందర్బంగా హీరో సూర్య జూమ్‌ వీడియో ద్వారా మీడియాతో గురువారం ముచ్చటించారు. అనేక విషయాలను పంచుకున్నారు. 

దాదాపు పదేళ్ళ క్రితం నుంచి ఈ చిత్ర ఐడియా సుధా కొంగరకి ఉందని, మూడేళ్ల క్రితం కలిసినప్పుడు ఇది చర్చకు వచ్చింది. అప్నటి నుంచి దీనిపై ఆమె వర్క్‌ చేయడం ప్రారంభించారు. ఓ సాధారణ వ్యక్తి అసాధారణమైన కలే ఈ సినిమా. ఎయిర్‌డెక్కన్‌ అధినేత గోపీనాథ్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇందులో నేను గోపీనాథ్‌ పాత్రలో నటించాను.  

గోపీనాథ్‌ ఓ స్కూట్‌ మాస్టర్‌ కొడుకు. విమాన రంగంలో తానేంటో నిరూపించుకోవాలని కలలు కన్నాడు, దాన్ని నెరవేర్చుకునే క్రమంలో అనేక సవాళ్ళని ఎదుర్కొన్నాడు. విమానరంగంలో గేమ్‌ ఛేంజర్‌గా నిలిచిన గోపీనాథ్‌, 23వేల రూపాయలున్న ఫ్లైట్‌ టికెట్‌ని నాలుగు వేలకు తగ్గించాడు. ఆ తర్వాత ఐదు వందలకు, దాన్ని చివరకు ఒక్క రూపాయికి తీసుకొచ్చాడని తెలిపాడు. 

సినిమా కోసం గోపీనాథ్‌ని కలిసినప్పుడు ఆయన తన జీవితంలోని సంఘటనలు చెప్పినప్పుడు రోమాలు నిక్కబొడిచాయి. చాలా ఇన్‌స్పైరింగ్‌ స్టోరీ ఆయనది. మొదటిసారి రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌ చేశా. ఈ పాత్ర చేస్తున్నప్పుడు నా గత విషయాలు గుర్తుకొచ్చాయి. నేను ఓ నటుడి కొడుకునే అయినా డిగ్రీ తర్వాత గార్మెంట్‌ కంపెనీలో పనిచేశాను. ఆరేడు వందలు సంపాదించాను. అదొక మర్చిపోలేని అనుభవం. అవన్నీ గుర్తొచ్చి చాలా ఎమోషనల్‌ అయ్యాను. 

అంతేకాదు ఫస్ట్ టైమ్‌ స్క్రిప్ట్ రీడింగ్‌ చేసి, పాత్రలో ఇన్‌వాల్వ అయి నటించానని తెలిపాడు. సుధా కొంగర.. మణిరత్నం `యువ` సినిమా నుంచి తెలుసని, ఆమెని నటుడిగా సంతృప్తి పరచడం చాలా కష్టమని, `గురు` తర్వాత ఆమెతో పనిచేయాలనిపించింది. ఈ సినిమాతో కుదిరిందని పేర్కొన్నారు. 

మోహన్‌బాబు వంటి గొప్ప నటుడితో కలిసి పనిచేయడం మంచి అనుభూతినిచ్చిందని, ఆయన రజనీకాంత్‌ వంటి స్టార్స్ తో చేశారని తెలిపారు. ఇందులో తనని గైడ్‌ చేసే పాత్రలో మోహన్‌బాబు కనిపిస్తారట. తన కోసం మోహన్‌బాబు ఈ సినిమా చేశాడని తెలిపారు. ఇక లాక్‌డౌన్‌ గురించి మాట్లాడుతూ, ఈ ఆరేడు నెలల్లో అందరిజీవితంలోనే కాదు తన జీవితంలో కూడా మార్పులొచ్చాయని పేర్కొన్నారు.