మెగా ఫ్యామిలీ వారసుడిగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన యువ హీరో సాయి ధరమ్‌ తేజ్‌. మెగా మేనల్లుడి  ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తన స్వశక్తితో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా తనకంటూ మంచి మార్కెట్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు. ప్రస్తుతం కొత్త దర్శకుడితో `సోలో బ్రతుకే సో బెటర్‌` సినిమాతో చేస్తున్నాడు సాయి ధరమ్‌ తేజ్‌. ఈ సినిమా తరువాత ఓ పీరియాడిక్ డ్రామాలో నటించేందుకు ఓకే చెప్పాడట ఈ సుప్రీం హీరో.

కెరీర్‌ వరుస పరాజయాల తరువాత ఈ మధ్యే తిరిగి గాడిలో పడ్డాడు సాయి ధరమ్ తేజ్‌. చిత్రలహరి, ప్రతిరోజూ పండగే సినిమాలో వరుసగా రెండు విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే జోరును కొనసాగించేందుకు జాగ్రత్తగా కెరీర్‌ను ప్లాన్ చేస్తున్నాడు. అందుకే రొటీన్‌కు భిన్నంగా ఓ పీరియాడిక్‌ డ్రామాలో నటించేందుకు ఓకె చెప్పాడు సాయి ధరమ్‌ తేజ్‌.

బిందాస్‌ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన కథా రచయిత వీరు పోట్ల తరువాత రగడ, దూసుకెళ్తా లాంటి హిట్ సినిమాలను రూపొదించాడు. తరువాత ఈడు గోల్డ్ ఎహే డిజాస్టర్‌ కావటంతో గత మూడేళ్లుగా ఒక్క సినిమా కూడా చేయలేదు. లాంగ్ గ్యాప్ తరువాత ఓ పీరియాడిక్‌ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. శ్రీ కృష్ణ దేవరాయల కాలం నాటి కథతో రూపొందుతున్న ఈ సినిమాతో సాయి ధరమ్‌ తేజ్‌ రాయలవారి పాత్రలో నటించనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.