బాలీవుడ్‌లో ఇంగ్లీష్‌ వింగ్లీష్‌, పర్చేడ్‌, వీరే ది వెడ్డింగ్ లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన నటుడు సుమిత్ వ్యాస్. డిజిటల్‌ ప్లాట్‌ ఫాంలోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ యువ నటుడు వ్యక్తిగత జీవితంలో ఆనందంతో పొంగిపోతున్నాడు. తాజాగా సుమిత్ వ్యాస్‌, ఎక్తా కౌల్‌ జంట పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. జూన్ 4న వీరు మగ బిడ్డకు జన్మనిచ్చినట్టుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమ కుమారుడికి వేద్‌ అని నామకరణం చేసినట్టుగా కూడా వెల్లడించారు. `ఇది మగబిడ్డ.. అతని పేరు వేద్‌. అమ్మ, నాన్నలుగా ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాం` అంటూ ట్వీట్ చేశాడు సుమిత్ వ్యాస్.

 

గతంలో తాను తండ్రి కాబోతున్న విషయాన్ని కూడా సినిమాటిక్‌గానే అభిమానులతో పంచుకున్నారు సుమిత్‌, కౌల్‌ జంట. ఓ రొమాంటిక్‌ ఫోటోను పోస్ట్ చేసిన వీరు.. `మా కొత్త ప్రాజెక్ట్‌ ను ప్రకటిస్తున్నందుకు గర్వపడుతున్నాం. త్వరలో జూనియర్‌ కౌల్‌, వ్యాస్‌ రాబోతున్నాడు. దీనికి సుమిత్, నేను క్రియేటర్స్‌. దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు కూడా వహిస్తున్నాం` అంటూ తమ ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేశాడు. తాజాగా మగ బిడ్డకు జన్మనిచ్చిన ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.