కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంది. దాంతో తెలుగు చిత్ర పరిశ్రమ కూడా మూత పడింది. ముఖ్యంగా రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు మొత్తం ఆగిపోయాయి. షూటింగ్ లు ముందే ఆపేసారు. మరి ఆ ఖాళీ టైమ్ లో ఇంటి దగ్గర కుటుంబంతో కాలక్షేపం చేసే వారు కొందరైతే మరికొందరు... ఈ సడన్ క్రైసిస్ టైమ్ ని తెలివిగా వినియోగించుకుంటున్నారు. అటు ఫ్యామిలీ లైఫ్..ఇటు ఫ్రొపెషినల్ లైఫ్ కు న్యాయం చేస్తున్నారు. అలాంటి వారిలో దర్శకుడు సుకుమార్ ఒకరు. 

అల్లు అర్జున్ తో ఆయన ప్రారంభించిన సినిమా షూటింగ్ బ్రేక్ వచ్చింది. మళ్లీ మొదలు కావటానికి, పరిస్దితిలు చక్కబడటానికి రెండు,మూడు నెలలు పట్టచ్చు. ఈ లోగా ఆయన తన శిష్యుడు పరిచయ చిత్రానికి సూచనలు, సలహాలు చేస్తున్నారు. ఆ సినిమా మరేదో కాదు ఉప్పెన. సాయి తేజ సోదరుడు వైష్ణవ్ తేజ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రం ఏప్రియల్ 2న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా దెబ్బకు వాయిదా పడింది. దాంతో మే 7 న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. ఈలోగా సినిమాని మరోసారి చూసిన సుకుమార్...కొన్ని ఎపిసోడ్స్ మరింత షార్ప్ గా ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. దాంతో ఆయన ఎడిటింగ్ టేబుల్ వద్ద కూర్చుంటున్నట్లు సమాచారం. 
 
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఫైనల్ స్టేజిస్ లో ఉంది. ఫైనల్ కాపీ అతి త్వరలోనే వస్తుందని చెప్తున్నారు. రెండున్నర గంటల రన్ టైమ్ కు లాక్ చేసారు. ఇక సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమవుతూ, ఈ ప్రేమకథా చిత్రాన్ని రూపొందించాడు.   మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమా కోసం 22 కోట్ల రూపాయలను ఖర్చు చేశారట.  ఈ సినిమాపై మైత్రీ మూవీ మేకర్స్ వారు పూర్తి నమ్మకంతో ఉన్నారట. అందువలన తామే స్వయంగా రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.