ఓటీటీ...(ఓవర్‌ ది టాప్‌)... తెలుగు పరిశ్రమలో ఎవరిని కదిపినా ఇప్పుడు ఈ అంశంపై చర్చలు,మాటలే వినిపిస్తున్నాయి. థియోటర్స్  మూతపడడంతో సినిమాల ప్రదర్శనకు ఇప్పట్లో అవకాశాలు లభించే సూచనలు కనిపించడం లేదని సినీ పెద్దలు ఇప్పటికే అనేక సార్లు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రూ.కోట్లలో వ్యయం చేసి నిర్మించిన సినిమాల్ని మరెంతకాలం బాక్సులకే పరిమితం చేస్తామని చాలామందికి తేలని పరిస్దితి. ఈ నేపధ్యంలో ఓవర్‌ ది టాప్‌ ప్లాట్‌ఫారాన్ని వినియోగించుకోవడమే సమంజసంగా ఉంటుందని చాలా మంది  నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ఓటీటీ ప్లాట్‌ఫారంలో ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌, ఎయిర్‌టెల్‌, బిగ్‌ఫ్లిక్స్‌, బాక్స్‌ టివి, హాట్‌స్టార్‌, జియో, బాక్స్‌ టివి, ఉల్లు, అమెజాన్‌, వియు, యప్‌ టివి తదితరాలు ఉన్నాయి. వీటి ద్వారా విడుదల చేస్తే ఆర్థికంగా పూర్తిగా కాకపోయినా కొంతైనా గిట్టుబాటు అవుతుందని భావిస్తున్నారు. లాక్‌డౌన్‌ను త్వరలో తొలగించినా, భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉన్నందున థియేటర్లు పునఃప్రారంభమవుతాయనే ఆశలు కనిపించడం లేదు. ఇప్పటికే అనేకమంది నిర్మాతలు, హీరోలు ఓటీటీ ప్లాట్‌ఫారంగా సినిమాల్ని రూపొందిస్తున్నారు. ఈ నేపధ్యంలో నాని, సుధీర్ బాబు నటించిన వి చిత్రాన్ని ఓటీటి ద్వారా రిలీజ్ చేయాలనే ప్రతిపాదనలు జరిగాయి. అయితే చివరకు వద్దనుకున్నారు. ఈ విషయమై ఓ ఆసక్తికరమైన విషయాన్ని సుధీర్ బాబు మీడియాతో పంచుకున్నారు. 

వి సినిమాను స‌గం వ‌ర‌కు ఓటీటీలో రిలీజ్ చేసి.. మిగ‌తా స‌గంపై  ఇంట్రస్ట్  రేకెత్తిద్దామ‌న్న ఆలోచ‌న ఒక ద‌శ‌లో తమ టీమ్ కు  వ‌చ్చింద‌న్నాడు. ఇలా చేయటం ద్వారా.. క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అనే త‌ర‌హాలో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి రేకెత్తించి వి సెకండాఫ్ చూసేందుకు థియేట్రిక‌ల్ రిలీజ్ కోసం ఎదురు చూసేలా చేయాల‌నుకున్న‌ట్లు తెలిపాడు. అయితే ఇది సరైన ఆలోచన కాదనిపించి  ఆ ఆలోచ‌న త‌ర్వాత విర‌మించుకున్నామ‌న్నాడు.