Asianet News TeluguAsianet News Telugu

‘సుడానీ ఫ్రమ్‌ నైజీరియా’ తెలుగు సినిమా రివ్యూ

ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ వారు మలయాళంలో ఘన విజయం సాధించిన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.రీసెంట్ గా ‘జల్లికట్టు’, ‘ఆండ్రాయిడ్‌ కట్టప్ప’
చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ క్రమంలో మరో చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సౌబిన్‌ షాహిర్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సుడానీ ఫ్రమ్‌ నైజీరియా’.
స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది బిగ్గెస్ట్‌‌‌‌ కమర్షియల్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ చిత్రాల్లో ఒకటి. కేరళ స్టేట్‌‌‌‌ ఫిల్మ్‌‌‌‌ అవార్డ్స్‌‌‌‌ ఐదు వచ్చాయి 66వ 'జాతీయ చలనచిత్ర పురస్కారాలు' లో ఉత్తమ మలయాళ చిత్రం అవార్డ్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్  స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా కథేంటి...తెలుగు వారికి నచ్చుతుందా...టైటిల్ అర్దమేమిటి..వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 

Sudani from Nigeria telugu movie review jsp
Author
Hyderabad, First Published Oct 30, 2020, 5:22 PM IST

కథ

 నైజీరియా ఫుట్ బాల్ ప్లేయర్ శ్యాముల్ ని కేరళకు చెందిన ఓ క్లబ్ వాళ్లు తమ తరుపున ఆడటానికి పిలుస్తారు. అయితే అతను వచ్చింది నైజారియానుంచైనా అందరూ అతన్ని సూడన్ నుంచి వచ్చాడనుకుని సుడాని అని పిలుస్తూంటారు. అప్పటికీ నేను నైజారియావాసిని అని చెప్తున్నా ...అబ్బే నువ్వు సూడాన్ నుంచే వచ్చావు అంటూంటారు.  ఇక్కడ ఆటలో సక్సెస్ తో దూసుకుపోతున్న శ్యాముల్  ఓ రోజు అనుకోకుండా బాత్రూమ్ లో కాలు జారి పడతాడు. దాంతో అతని మడమ దగ్గర బాగా దెబ్బ తగిలి నడవలేని పరిస్దితి వస్తుంది. చిన్న సర్జరీ, ఫిజయోథెరపీ చేయించాల్సి వస్తుంది. ఈ భాధ్యత అంతా క్లబ్ మేనేజర్ మజీద్ రెహమాన్ పై పడుతుంది. తప్పించుకుందామనుకున్నా శ్యాముల్ పూర్తి భాధ్యత తనదే అని ఎగ్రిమెంట్ ఉండటంతో  కుదరదు. అలాగని హాస్పటిల్ లో ఉంచి ట్రీట్మెంట్ చేయించాలంటే నెలకు రెండు లక్షల దాకా అవుతుంది. అసలు ఇప్పటికే జరిగిన ట్రీట్మెంట్ కు ప్రెండ్ భార్య నగలు తాకట్టు పెట్టాల్సి వచ్చింది. 

వేరే దారి లేని పరిస్దితుల్లో  డబ్బు ఆదాకోసం తన ఇంట్లో పెట్టుకుంటాడు. అలా బెడ్ మీద పడుకుని ఉన్న శ్యాముల్ ని చూసేదెవరు అని బెంగపడతాడు. కానీ మజీద్ తల్లి ముందుకు వచ్చి ఆ భాధ్యత తీసుకుంటుంది. వాస్తవానికి మజీద్ కు అతని తల్లికి మధ్య ఎమోషనల్ గ్యాప్ ఉంది. తన తండ్రి చిన్నతనంలో చనిపోతే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని తల్లితోనూ, సవతి తండ్రితోనూ మాట్లాడడు. అవసరమైన పొడి పొడి మాటలు తప్ప తల్లితో మరొక్క మాట కూడా మాట్లాడడు. అది ఆవిడికి చాలా బాథ కలుగుతుంది. ఇలాంటి సిట్యువేషన్ లో ఆ ఇంట్లోకి శ్యామూల్ వచ్చి పడ్డాడు. బెడ్ మీద ఉన్న అతన్ని చూడటానికి లోకల్ జనం వచ్చి పోతూంటారు. ఏదో కాలక్షేపం జరుగిపోతోంది..నెల రోజులు ఓపిక పడితే అతన్ని నైజారియా పంపేద్దామనుకుంటాడు. 

కానీ ఈ లోగా ఆర్దిక సమస్యలు తో పాటు, అనేక అనుకోని సంఘటనలు, రకరకాల సమస్యలు మజీద్ పై పడతాయి. ఓ ప్రక్క ఫైనాన్స్ ట్రబుల్స్..మరో ప్రక్క ఓ ఇమ్మిగ్రెంట్స్ ని ఇంట్లో ఎలా పెట్టుకున్నారు..ఫర్మిషన్స్ ఉన్నాయా అంటూ పోలీస్ లు, క్రైమ్ బ్రాంచ్ తిరుగుతూంటారు. వీటిన్నటినీ మ్యానేజ్ చేసి కాస్త కోలుకున్నాడనుకున్నాక నైజారియాకు ప్రయాణం పెడతాడు. అయితే అప్పుడు ఓ పెద్ద సమస్య వచ్చిపడుతుంది. శ్యాముల్ ని క్రైమ్ బ్రాంచ్ అధికారులు వచ్చి తీసుకెళ్లతారు. అసలు ఆ సమస్య ఏమిటి..శ్యాముల్ ని క్రైమ్ బ్రాంచ్ ఎందుకు తీసుకెళ్లింది..చివరకు శ్యాముల్ ని అతని స్వదేశం పంపగలిగారా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది..

స్పోర్ట్స్ డ్రామాల్లో ఎంతసేపూ రెండు గ్రూప్ లు మధ్య పోటీ. అందులో ఓ గ్రూప్ విలన్ ది,మరొకటి హీరోది కావటం, ఫైనల్ గా క్లైమాక్స్ లో ..హీరో గ్రూప్ గెలవటం అనే ఓ ఫార్ములా చుట్టూనే కథలు అల్లుతారు. అయితే ఈ సినిమాలో ఆ ఫార్ములా లేదు. అలాగే ఇది సంపూర్తిగా స్పోర్ట్ ఫిల్మ్ కాదు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఓ హ్యూమన్ ఎమోషన్ స్టోరీ. స్పోర్ట్స్ ని ఓ మెటాఫర్ గా కథలో వాడారు అంతే. స్టోరీ టెల్లింగ్..నిజంగా కథ ఎక్కడైనా జరిగిందా అన్నంత న్యాచురల్ గా తెరకెక్కించారు. ఇక హీరో పెళ్లి చూపులు సైతం ఓ ప్రహసనంలా సాగుతాయి. వాటిని అతను ఓ సెలక్షన్ క్యాంప్ లా అభివర్ణిస్తాడు. అతను ఎప్పుడూ మ్యాచ్ లలో బిజీగా ఉంటూంటాడు. మనం ఫుట్ బాలర్స్ మి ..ఎప్పుడైనా ఓడిపోతున్నా..చివరి నిముషంలో అయినా డ్రా అవుతుందేమో అని ఎదురుచూస్తూంటాము. అని సినిమా మొత్తం థీమ్ ని ఒక డైలాగులో చెప్పేస్తాడు. స్క్రీన్ ప్లేలో జిమ్మిక్కులు లేవు కానీ ఎంగేజ్ చేసే విధానం అయితే ఉంది. 
 
ఎవరెలా..

ఈ సినిమా కథకు సరైన నటీనటులు పడకపోతే అదో రకంగా తయారయ్యేది. ఆ విషయంలో దర్సకుడు సక్సెస్ అయ్యారు. ఇక జకారియా బ్రిలియెంట్ స్క్రీన్ ప్లే, అబ్దుల్లా షార్ప్ ఎడిటింగ్ సినిమాకు ప్లస్ అయ్యాయి. కథలో డెప్త్ ఖచ్చితంగా మన హృదయాలను తాకుతుంది. నైజారియా ప్రెండ్ తో ఇండియన్ క్యారక్టర్స్ ప్రవర్తించే తీరు రైటింగ్ సామధ్యాన్ని తెలియచేస్తాయి. అయితే సుదు బ్యాక్ గ్రౌండ్ స్టోరీ మాత్రం మ్రొక్కుబడిగా ఉన్నట్లుంటుంది. నిజానికి కథకు అది అనవసరం కూడా. అతను ఎవరైనా ఇక్కడ వారు ఎలా అతన్ని రిసీవ్ చేసుకున్నారనేది కథ అయ్యినప్పుడు అతని ప్లాష్ బ్యాక్ , అతని కుటుంబ నేపధ్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక మజీద్ తల్లిగా చేసిన జమీల్యా మనకు సినిమా పూర్తైనా అలా గుర్తుండిపోతుంది. అలాగే ఇంత సీరియస్ స్క్రిప్టు చాలా చోట్ల చక్కగా నవ్విస్తుంది. అలా సీన్స్ డిజైన్ చేయటం గొప్ప విషయం.నైజీరియా ప్రెండ్ తో  వచ్చీ రానీ ఇంగ్లీష్ మాట్లాడే మజీద్ పాత్ర మనకు తెగ నచ్చేస్తుంది.   

 ఫైనల్ థాట్..
 
  ‘ సినిమా ఫ్రమ్‌ కేరళ’ లో చాలా ఆణిముత్యాలు ఉన్నాయి. వాటిని చూపించి ఆహా అనిపిస్తున్న ఓటీటీలకు ధాంక్స్

--సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating:3

 

Follow Us:
Download App:
  • android
  • ios