ఈ ఏడాది మొదట్లోనే స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్‌ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన బన్నీ, షార్ట్‌ గ్యాప్‌ తరువాత సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాను ప్రకటించాడు. అయితే ఈ సినిమా టీంతో బన్నీ జాయిన్‌ కావడానికి ముందే కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో షూటింగ్‌ ఆగిపోయింది. ఈ గ్యాప్‌లో మరో సినిమా కథ విని ఓకే చేశాడు బన్నీ.

బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల దర్శకుడు కొరటాల శివతో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు అల్లు అర్జున్‌. శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఏఏ 21 అనే పేరుతో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో పోస్టర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. ఈ సినిమాను యువ సుథా ఆర్ట్స్‌, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సినిమా ఎనౌన్స్‌మెంట్ పోస్టర్‌ చూస్తుంటే ఈ మూవీ రూరల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఈ సినిమాను 2022 స్టార్టింగ్‌లో రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు.

బన్నీ మార్క్‌ ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు, కొరటాల మార్క్‌ మేసేజ్‌ కూడా ఉండేలా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే బన్నీ సినిమా పనులు ప్రారంభించేలా ప్లాన్‌ చేసుకున్నాడు కొరటాల.