లాక్‌డౌన్ కారణంగా టీవీ సీరియల్స్, షోల షూటింగ్ లు ఆగిపోయాయి. తమ దగ్గర ఉన్న ఫుటేజ్ అయ్యిపోయింది. అదే సమయంలో జనాలంతా టీవిలకు అతుక్కుపోతున్నారు. దాంతో రోజూ వారి ఇరవైనాలుగు గంటలూ వాళ్లకు ఏం చూపెట్టాలో ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ కు అర్దం కావటం లేదు. పాత షోలు రిపీట్ వేస్తున్నారు. వేసిన సినిమాలే మళ్లీ మళ్లీ వేస్తున్నారు. వారం రోజుల గ్యాప్‌లోనే మళ్లీ రిపీట్ చేస్తున్నారు కూడా. అదే పద్దతిలో ఓ టీవి ఛానెల్ తీసుకున్న నిర్ణయం మెగా మేనల్లుడు సాయి తేజ కు బాధ కలిగిస్తోందిట.

గమనిస్తే... జీ తెలుగు, మా టీవీ లాంటి ఛానెల్స్ అయితే తమకున్న అన్ని ఛానెల్స్‌లో ఒకే సినిమాను రెండు రోజుల గ్యాప్‌లోనే మూడు నాలుగు సార్లు రిపీట్ చేస్తూ షాక్ ఇస్తున్నారు.అలాగే సరిలేరు నీకెవ్వరు సినిమాను మరోసారి టెలికాస్ట్ చేయబోతున్నారు జెమినీ. ఉగాది కానుకగా మార్చ్ 25న వచ్చిన సరిలేరు నీకెవ్వరు రికార్డ్ టిఆర్పీ రేటింగ్ తీసుకొచ్చింది. కదా అటు వైపే ప్రయాణం పెట్టుకుంది. మరి పోటీ ఛానెల్ స్టార్ మా మాత్రం ఏం చేయాలి..తమ దగ్గర టెలికాస్ట్ చేయకుండా ప్రక్కన పెట్టేసిన సినిమాలను బయిటకు తీస్తోంది.  ఆక్రమంలో ఈ శుక్రవారం స్టార్ మా లో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన “తిక్క” సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చెయ్యనున్నారు. 

కొన్ని ఛానెల్స్ కొన్ని యావరేజ్ సినిమాలను తీసుకొచ్చినా వీరు మాత్రం మరీ ఘోరమైన ప్లాప్ సినిమాను తీసుకొస్తున్నారని అందరూ అంటున్నారు. వరసపెట్టి జాను, ఎంతమంచివాడవురా, తిక్క ఇలా వేస్తున్నారు. ఇక తిక్క విషయానికి వస్తే సాయి ధరమ్ తేజ కెరీర్ లో పెద్ద డిజాస్టర్ తిక్క. అసలు ఆ సినిమాని మర్చిపోదామనుకుంటున్నాడు. ఎందుకంటే గుర్తుకు వస్తే ఇంత డిజాస్టర్ సినిమా చేసామా అనే బాధ తప్ప మరేమీ మిగలదు. కాని ఇప్పుడు మా టీవి వారు సాయి కు ఆ బాధను మళ్లీ గుర్తు చేసేందుకు సిద్దమవుతున్నారు. సాయి ధరమ్ తేజ కూడా ఇప్పుడు ఈ సినిమా టెలీకాస్ట్ చేయటం అవసరమా అని ఫీల్ అవుతున్నాడట. తన కెరీర్ ఇప్పుడిప్పుడే మళ్లీ గాడిలో పడుతున్న సమయంలో తన పాత ప్లాఫ్ సినిమాని ఇలా జనాల్లోకి తీసుకెళ్లటం ఇబ్బందే. కానీ ఏం చేయగలడు.