సింగర్ బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ బులెటిన్ విడుదల చేశారు. ఓ వీడియో సందేశం ద్వారా ఎస్పీ బాలు తాజా పరిస్థితిపై ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. దాదాపు నాలుగు రోజుల తరువాత అప్డేట్ తో వచ్చిన ఆయన బాలు అభిమానులకు సంతోషం కలిగించే విషయాలు చెప్పారు. ఆయన మాట్లాడుతూ...'నాన్నగారి ఊపిరి తిత్తులు మెరుగయ్యాయి, ఎక్సరే రిపోర్ట్స్ లో అది స్పష్టంగా తెలుస్తుంది. నాన్నగారికి డాక్టర్స్ ఫిజియో థెరపీ అందిస్తున్నారు. దానికి ఆయన బాగా సహకరిస్తున్నారు. అలాగే డాక్టర్స్ ఆయన్ని కొద్దిసేపు బెడ్ పై కూర్చోపెట్టారు. దాదాపు 15 నిముషాలు నాన్నగారు కూర్చోగలిగారు. డాక్టర్స్ ఆయనకు నోటి ద్వారా ఆహారం అందించాలని అనుకుంటున్నారు' అని అన్నారు. 

అలాగే వారి తండ్రి కోసం అభిమానులు చేసిన ప్రార్ధనలకు, చూపించిన ప్రేమాభిమానాలకు చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 10వ తేదీ తర్వాత నిన్న చరణ్ ఈ అప్డేట్ ఇవ్వడం జరిగింది. తాజా ప్రకటనతో బాలు ఆరోగ్యం మునుపటి కంటే బాగా మెరుగైనదని అర్థం అవుతుంది. త్వరలోనే బాలు సంపూర్ణ అరోగంతో తిరిగిరానున్నారన్న నమ్మకం అందిరిలో బలపడింది. 

ఇప్పుటికి దాదాపు 40రోజులుగా బాలు ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్నారు. తనకు కరోనా సోకిందని, ప్రాధమిక దశలో ఉంది, నాకు ఏమీ కాదని ఆసుపత్రిలో చేరే ముందు బాలు చెప్పడం జరిగింది. ఐతే ఎంజిఎం హాస్పటల్ లో చేరిన బాలు ఆరోగ్యం ఒక వారం తరువాత విషమించడం జరిగింది. దీనితో ఆయనను ఐసీయూ కి తరలించారు. ఒక దశలో బాలు ఆరోగ్యం ప్రమాద స్థాయికి చేరింది. మనో ధైర్యంతో బాలు కరోనాతో పోరాడారు.