ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి తరచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్, చిత్ర పరిశ్రమలో అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక దాడులపై చిన్మయి సోషల్ మీడియా వేదికగా గళం వినిపిస్తోంది. తమిళ రచయిత వైరముత్తు తనతో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనని కూడా చిన్మయి బయటపెట్టిన సంగతి తెలిసిందే. 

ఈ వ్యవహారం చిన్మయికి పెద్ద చిక్కులే తెచ్చిపెట్టింది. వైరముత్తుపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెని తమిళ డబ్బింగ్ ఆర్టిస్ట్ సంఘం నుంచి బహిష్కరించారు. అయినా కూడా చిన్మయి వెనకడుగు వేయడం లేదు. మహిళలకు జరుగుతున్న అవమానాలపై చిన్మయి ముందుగా స్పందిస్తోంది. 

ఇటీవల స్విగ్గీ డెలివెరి బాయ్ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన తీరు వివాదంగా మారింది. స్విగ్గీ డెలివెరి బాయ్ ఫుడ్ డెలివెరీ చేయడానికి ఓ మహిళ ఇంటికి వెళ్ళాడు. ఆమెని చూసి దుపట్టా వేసుకోవచ్చు కదా అని అడిగాడు. దీనితో సదరు మహిళ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా స్విగ్గీ సంస్థకు కంప్లైంట్ చేసింది. 

ఆమె సోషల్ మీడియాలో స్విగ్గీ సంస్థకు సూచిస్తూ.. మీ డెలివెరీ బాయ్స్ నోటిని అదుపులో ఉంచుకోమని చెప్పండి. వారి పని ఏదో చూసుకుని వెళ్ళమని చెప్పండి. మీ డెలివెరీ బాయ్ ఒకరు దుపట్టా వేసుకోమని అడిగాడు. నా ఇంట్లో ఏబట్టలు వేసుకోవాలో నాకే చెబుతున్నాడు. మీరు మీ ఉద్యోగులకు కనీసం మర్యాద నేర్పరా అని ఆమె మండిపడింది. 

ఈ ట్వీట్ వైరల్ అయ్యాక.. కొందరు నెటిజన్లు ఆమెనే ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దీనితో సింగర్ చిన్మయి సదరు మహిళకు మద్దతు తెలుపుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ మహిళ తన ఆవేదన చెప్పుకుంటుంటే ట్రోల్ చేస్తున్నారు అంటూ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. 

హాలీవుడ్ పీఆర్ ఏజెన్సీలతో రాజమౌళి టాక్స్!

ఓ మహిళ తన ఒంటిపై దుపట్టా వేసుకోకుంటే నగ్నంగా కనిపించినట్లేనా.. తనని రేప్ చేయమని ఆమె ఆహ్వానించినట్లు అర్థమా.. అని చిన్మయి ప్రశ్నించింది. చిన్మయి స్పందనకు కొందరు మద్దతు తెలుపుతుంటే.. మరికొందరు ఆమెని కూడా ట్రోల్ చేస్తున్నారు.