క‌రోనా పోరులో రియ‌ల్ హీరో అక్ష‌య్ కుమార్‌ గా మారటం చాలా మంది బాలీవుడ్ నటులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఆ విషయమై చాలా మంది సైలెంట్ గా ఉన్నారు. కానీ ఫైర్ బ్రాండ్ గా పేరు బడ్డ శతృఘ్న సిన్హా మాత్రం ఓపెన్ గా ఈ డొనేషన్ విషయమై తప్పు పట్టారు. 

వివరాల్లోకి వెళితే...క‌రోనా పై పోరులో మేము సైతం అంటూ.. ఎంద‌రో సినీ ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ మ‌రోసారి త‌న గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. పీఎం రిలీఫ్ ఫండ్ కోసం అక్ష‌య్ కుమార్ రూ. 25 కోట్లు విరాళం అందజేశారు. అలాగే కరోనాపై పోరాటంలో ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.3 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. మున్సిపల్‌ కార్మికుల ఆరోగ్యం కోసం పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌కు(పీపీఈ) ఈ డబ్బును అందజేశారు.

ఈ విషయాన్ని మీడియా ఓ రేంజిలో ఎత్తుతోంది.  ఇరవై ఎనిమిది కోట్ల విరాళం ఇచ్చి  మరోసారి రియ‌ల్ హీరో అనిపించుకున్నారని అంటోంది.  అక్ష‌య్ ఉదార స్వ‌భావానికి అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే శతృఘ్న సిన్హా మాత్రం ఈ విషయాన్ని తప్పు పట్టారు. 

డొనేషన్స్ ఇవ్వచ్చు కానీ పైకి బహిరంగంగా చెప్పుకోవటం ఎందుకుని ప్రశ్నించారు. దానివలన డొనేషన్ ఇద్దామనుకున్న చాలా మందికి ఇది ఇబ్బందిగా మారుతుందని వ్యాఖ్యానించారు. అక్షయ్ ఇచ్చిన డొనేషన్ తో మిగతా వారి డొనేషన్స్ ని పోల్చి చూస్తారని అందరికీ భయం ఉంటుంది, దాంతో చాలా మంది ఇవ్వరని అన్నారు.  ఇక లాక్ డౌన్ విషయమై స్పందిస్తూ..ప్రధాని తీసుకున్న నిర్ణయం మెచ్చుకోదగినదే కానీ బాగా ఆలస్యమైందని అన్నారు. ఇప్పుడు మీడియా దృష్టి మొత్తం శతృఘ్న సిన్హా కామెంట్స్ పైకి వెళ్లింది. మరి ఈ విషయమై అక్షయ్ ఏమంటారో చూడాలి.