`గమ్యం`, `ప్రస్థానం` వంటి చిత్రాల  తర్వాత మరోసారి ప్రయోగాత్మక, ఇంటెస్ట్ కథతో  సినిమా చేయబోతున్నాడు యంగ్‌ హీరో శర్వానంద్‌. తాజాగా ఆ సినిమాని ప్రకటించారు. `మహాసముద్రం` పేరుతో రూపొందే ఈ సినిమాకి `ఆర్‌ఎక్స్ 100` ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహించనున్నారు. 

శర్వానంద్‌ హీరోగా, అజయ్‌ భూపతి రూపొందించబోతున్న `మహాసముద్రం` చిత్రాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన ప్రతి వారం ఒక్కో సెన్సేషనల్‌ సర్‌ప్రైజ్‌ని అప్‌డేట్‌లుగా పంచుకుంటామని నిర్మాణసంస్థ తెలిపింది. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మించనున్నారు. ఈ బ్యానర్‌ నుంచి చివరగా మహేష్‌ నటించిన `సరిలేరు నీకెవ్వరు` బ్లాక్‌ బస్టర్‌ వచ్చిన విషయం తెలిసిందే. 

ఇందులో శర్వానంద్‌ పాత్ర చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుందని, సినిమా అన్ని రకాల అంశాలు మేళవించిన ప్యాకేజీ ఎంటర్‌టైనర్‌ అని చెప్పారు. అజయ్‌ భూపతి పవర్‌ఫుల్‌ స్క్రిప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కించనున్నాడని, అందుకే శక్తివంతమైన టైటిల్‌ పెట్టినట్టు తెలిపారు. ఇంటెన్స్ లవ్‌, యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో బైలింగ్వల్‌గా రూపొందించనున్నట్టు చిత్ర బృందం చెప్పింది.

శర్వానంద్‌ ప్రస్తుతం `శ్రీకారం` చిత్రంలో నటిస్తున్నారు. రైతు ప్రాధాన్యతని తెలిపే ఈ సినిమాకి కిశోర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు మరో బైలింగ్వల్‌ చిత్రాన్ని శర్వానంద్‌ చేయబోతున్నట్టు టాక్‌.