షాహిద్‌ కపూర్‌ గతేడాది `కబీర్‌సింగ్‌`తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ని అందుకున్నారు. ఇది తెలుగులో విజయ్‌ దేవరకొండ హీరోగా వచ్చిన `అర్జున్‌రెడ్డి`కి రీమేక్‌ అనే విషయం తెలిసిందే. హిందీలో కూడా మాతృక దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా రూపొందించారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ప్రీతిగా తనకి విశేషమైన క్రేజ్‌ వచ్చింది. 

తాజాగా మరో తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు షాహిద్‌ కపూర్‌. నాని హీరోగా రూపొందిన విజయం సాధించిన `జెర్సీ`లో హీరోగా నటిస్తున్నారు. దీనికి కూడా మాతృక దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి డైరెక్షన్‌ చేస్తున్నారు. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌. ప్రస్తుతం ఇది చిత్రీకరణ జరుపుకుంటోంది. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం థియేటర్ల ఓపెనింగ్‌ విషయంలో నెలకొన్న కరోనా సంక్షోభం సినిమాలు ఓటీటీ వైపు చూసేలా చేస్తుంది. అందులో భాగంగా ఈ కబీర్‌ సింగ్‌ తన మూడు సినిమాలను ఓటీటీలో విడుదల చేయబోతున్నాడు. అందుకోసం నెట్‌ఫ్లిక్స్ తో డీల్‌ కుదుర్చుకున్నారు. ప్రత్యేకంగా నెట్‌ఫ్లిక్స్ కోసమే మూడు సినిమాలు చేసేలా ఒప్పందం కుదిరిందని టాక్‌. షాహిద్‌ నెక్ట్స్ నటిస్తున్న `అపరేషన్‌ క్యాక్టస్‌` ని ఏకంగా నెట్‌ఫ్లిక్సే నిర్మిస్తుంది. దీంతో స్టార్‌ హీరోలు కూడా ఓటీటీల కోసం సినిమాలు చేయబోతున్నారనే ట్రెండ్‌ ఊపందుకోనుందని చెప్పొచ్చు.