బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ఎంత పెద్ద దుమారం రేపిందో తెలిసిందే. హీరోయిన్ రియా చక్రవర్తి అరెస్ట్ తో మొదలైన ఈ కేసు టాప్ హీరోయిన్స్ విచారణ వరకు సాగింది. డ్రగ్స్ ఆరోపణలపై దీపికా పదుకొనె, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ మరియు శ్రద్దా కపూర్ లను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విచారించడం జరిగింది. సుశాంత్ సింగ్ డెత్ కేసుతో మొదలైన అధికారుల విచారణ డ్రగ్స్ కేసుగా మలుపు తిరిగి అనేక సంచలనాలకు కారణం అయ్యింది. 

కొంత కాలం జైలులో గడిపిన రియా చక్రవర్తి ఇటీవల బెయిల్ పై విడుదల కావడం జరిగింది. ఈ మధ్య డ్రగ్స్  కేసు సద్దు మణిగిందని అందరూ అనుకుంటుండగా మరో నటి డ్రగ్స్ కేసులో అధికారులకు అడ్డంగా దొరికినట్లు తెలుస్తుంది. సీరియల్ నటి ప్రీతికా చౌహాన్ డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా నార్కోటిక్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో మఫ్టీలో ఉన్న అధికారులు కాపు కాసి ఆమె బండారం బట్టబయలు చేశారు. 

అధికారుల అదుపులో ఉన్న ప్రీతికా చౌహాన్ ని పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నారు. ప్రీతికాతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దేవో కే దేవ్ మహాదేవ్ మరియు సంవాదన్ ఇండియా వంటి సీరియల్స్ ద్వారా ప్రీతికా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రీతికా చౌహాన్ అరెస్ట్ తో మరి కొందరు బుల్లితెర నటుల పేర్లు బయటికి వచ్చే అవకాశం కలదు. ఇక శాండిల్ వుడ్ లో డ్రగ్స్ ఆరోపణలపై హీరోయిన్ సంజనా గల్రాని, రాగిణి ద్వివేది అరెస్టైన సంగతి తెలిసిందే.