సైన్స్ ఫిక్షన్ సినిమాలు,  థ్రిల్ల‌ర్స్ తీయ‌డంలో… మ‌న వాళ్లు బాగా వెనకబడే ఉన్నారు. అప్పుడెప్పుడో ఆదిత్యా 369, ఆ తర్వాత సూర్య హీరోగా 24 ,అంతరిక్షం 9000..ఇంకా ఒకటీ అరా దశాబ్దానికి ఒకటి అన్నట్లు వస్తున్నాయి. సైన్స్ ఫిక్షన్ అంటే మనవాళ్లకు అర్దం కాదనే చిన్న చూపో..లేక అలాంటి సినిమాలకు బిజినెస్ కాదనో.., వేరక కారణంతోనో ప్రక్కన పెట్టేస్తారు. అయితే ప్రపంచ సినిమాలో మాత్రం సైన్స్ ఫిక్షన్ అనేది పాపులర్ జానర్. అక్కడ నిరంతరం సైన్స్ ఫిక్షన్ సినిమాలు..ముఖ్యంగా టైమ్ ట్రావిలింగ్ మీద వస్తూనే ఉంటాయి. కేవలం హాలీవుడ్ మాత్రమే కాకుండా కొరియా, చైనా వంటి దేశాలు కూడా సైన్స్ ఫిక్షన్ సినిమాలు చేస్తున్నాయి. 

వాళ్ల సైన్స్ ఫిక్షన్ లు ఎంత పాపులర్ అంటే...అలాంటి కథ అనుకోవాలన్నా, ప్రేరణ పొందాలన్నా ఆ సినిమాలే మనకు దిక్చూచీ. అయితే ఈ లోటుని గమనించాడో లేక కొత్త కాన్సెప్టుతో రావాలనే తపనో కానీ దర్శకుడు ఈ జానర్ లో ఓ కథ రాసుకుని మన ముందుకు వచ్చాడు. `ప్లే బ్యాక్`  అనే టైటిల్ తో తెలుగులో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చిన ఈ  సినిమాలో కథేంటి...సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో చర్చించబడ్డ సైన్స్ ఏమిటి..దాన్ని ఫిక్షన్ చేసి తెరకెక్కించిన విధానం ఎలా సాగింది?అందులోంచి మనకు అందిన థ్రిల్ ఎంత‌? ఈ సినిమాకు ఏదన్నా సినిమా ప్రేరణ లేదా రిఫరెన్స్ ఉందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 
 
కథేంటి...

కార్తి (దినేష్ తేజ్) ఈ కాలం కుర్రాడు. పెద్ద జర్నలిస్ట్ అవ్వాలనే జీవితాశయం ఉన్నవాడు. దాంతో టీవి 5 లో జాబ్ లో జాయిన్ అవుతాడు. అయితే ఆ తర్వాత ఇంటి ఓనర్ తో తగువు పెట్టుకుని తన రూమ్ మేట్ తో కలిసి రూమ్ కాళీ చేసేసి హైదరాబాద్ లోని ఇందిరా కాలనికి వెళ్తాడు. అదో పాతకాలం ఇల్లు. దాంట్లో మనవాడు దిగాక అక్కడ ల్యాండ్ లైన్ ఉండటం గమనిస్తాడు. ఈ సెల్ రోజుల్లో మా సెడ్డ సిరాగ్గా ఈ ల్యాండ్ లైన్ ఏమిటి అనుకోకుండా దాని వంకే చూస్తూంటే అది మ్రోగుతుంది. ఫోన్ ఎత్తుతాడు. అవతలి నుంచి ఓ అమ్మాయి సుజాత (అనన్య నాగేళ్ల). రాంగ్ నెంబర్ అని ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత మళ్లీ ఆమె నుంచే కాల్. 

మళ్లీ ఆమె నుంచే కాల్. ఇలా పాపం ఆ అమ్మాయి ఎవరికి కాల్ చేసినా ఈ నెంబర్ కే వస్తుంది. సర్లే అమ్మాయి కదా అని కాస్తంత ఎంకరేజింగ్ గా మాట్లాడతాడు. ఆ తర్వాత ఆమెకు పాస్ పోర్ట్ విషయంలో సాయం చేయాలనుకుంటాడు. ఎందుకంటే ఆమెకు సెల్ ఫోన్ తెలియదు. ఇంటర్నెంట్ తెలియదు. వెబ్ సైట్లు తెలియదు.ఇదేంటిది ఓటీటి రోజుల్లో ఈ తింగరి పిల్ల ఎవరు అని విసుక్కుంటాడు. ఆ తర్వాత ఆమె ఎవరో చూద్దామనే పాస్ పోర్ట్ ఆఫీస్ కు వెళ్తే అక్కడ ఆమె కనపడదు. వచ్చానంటుంది. తల గోక్కున్న కార్తి ..ఓ క్షణం ఆటపట్టిస్తుందేమో అనుకుంటాడు. 

కానీ ఆమె మాటల్లో నిజాయితీ..ఆ క్రమంలో అతనికి అర్దమయ్యే మాటల్లో తెలిసిన విషయం షాక్ కు గురి చేస్తుంది. ఆమె తాను 1993సంవత్సరంలో ఉంది. తాను 2019లో ఉన్నాడు. రెండు వేర్వేరు టైమ్ లైన్ లు. ఇదెలా సాధ్యం. అప్పుడు గమనిస్తే మరో షాక్. అసలా లాండ్ లైన్ కు కనెక్షన్ ఎప్పుడో కట్ అయ్యిపోయింది. అయినా ఫోన్ వస్తోంది. అసలు ఆమె చెప్పేది నిజమేనా అనే సందేహం లో క్రాస్ చెక్ చేస్తే నిజమే అని తెలుస్తుంది. అందుకు కారణం క్రాస్ కనెక్షన్ అని తెలుస్తుంది. సర్లే అని ప్రక్కన పెట్టేద్దామనుకుంటే మరో విషయం రివీల్ అవుతుంది. అవతలి మాట్లాడే అమ్మాయికీ తనకు ఓ రిలేషన్ ఉందని తెలుస్తుంది. అంతేకాదు ఆమె ఓ పెద్ద ప్రమోదంలో ఉందని అర్దమవుతుంది. ఇప్పుడేం చేయాలి ఇదే కార్తీ క్వచ్చిన్. మీకూ అదే ప్రశ్న ఉదయిస్తే సినిమా చూసేయండి. 

ఎనాలసిస్...
ఇదో సైన్స్ ఫిక్షన్ అని మొదటే చెప్పేసుకున్నాం కాబట్టి కథ ఇలాగే ఉండే అవకాసం ఉందని మీకు అర్దమయ్యే ఉంటుంది. గతంలో ఉన్న అమ్మాయి, వర్తమానంలో ఉన్న కుర్రాడుతో క్రాస్ కనెక్షన్ తో ఎలా కనెక్ట్ అయ్యిందనేది ఒకటే చూపెడితే ఇదో డాక్యుమెంటరీ అయ్యేది. కానీ ఇందులో ఓ క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎమోషన్ కలిపాడు కాబట్టే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఇన్ తెలుగు అయ్యింది. ఇలాంటి సినిమాల్లో ఇదే మొదటిది ..ఇదే ఆఖరుది అంటూ చెప్పం ఎందుకంటే..2016లో సౌత్ కొరియాలో సిగ్నల్ అనే టీవీ సీరిస్ ఇలాంటి సిమిలర్ పాయింట్ తో వచ్చింది. తర్వాత దాన్ని అన్ నోన్ నంబర్ అని చైనావాళ్లు రీమేక్ చేసారు. జపాన్ వాళ్లు మరో టైటిల్ తో రీమేక్ చేసారు.  అయితే అవన్ని వాళ్ల కాల,మాన పరిస్దితులకు అనువైనట్లుగా నడిచేవి. మన తెలుగులో,మనకు అర్దమయ్యే సులభమైన  చెప్పటమే ఈ దర్శకుడు చేసిన తెలివైన పని. అలాగే సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో కష్టమనిపించే కామెడీ ట్రాక్ లు, రిలీఫ్ కోసం ఐటెం సాంగ్ లు పెట్టలేదు. 

కొత్తోడు అయితేనేం హీరో కదా అని దుమ్ము దులిపే ఫైట్స్ పెట్టలేదు. నీటుగా అనుకున్న థ్రిల్లర్ ని అల్లుకుంటూ పోయాడు. కొత్త మొహాలు కాబట్టి మొదటి పది నిముషాలు ఇబ్బంది అనిపించినా మెల్లిమెల్లిగా కథలోకి వెళ్లిపోయి వాళ్లు పాత్రలు లాగానే కనిపిస్తారు. ఫస్టాఫ్ ...క్రాస్ కనెక్షన్ అనే సెటప్ ని ఎస్టాభ్లిష్ చేసి, సెకండాఫ్ మొత్తం ఆ పాయింట్ పై లిటరల్ గా ఆడుకున్నాడు. ఏ కాసేపు ప్రక్కకు తిరిగినా ఏం మిస్సవుతామో అనే భయం కలిగించాడు. ఆ రకంగా స్క్రీన్ ప్లేని డిజైన్ చేసాడు. ఇక ఈ థ్రిల్ల‌ర్ మరో  ప్ర‌త్యేక‌త ఏమిటంటే… వాళ్లు కేవ‌లం క‌థ మాత్ర‌మే చెప్పాడు. స్ట్రెయిట్ గా క‌థ‌లోకి బంగీ జంప్ చేసి, చివరదాకా క‌థ‌తోనే ప్ర‌యాణం చేసారు. అన‌వ‌స‌ర‌మైన హంగామా లేదు. పాట‌లు అస్స‌లే లేవు. చివర్లో చ‌క్క‌టి ముగింపు ఇచ్చాడు ద‌ర్శ‌కుడు.

టెక్నికల్ గా ...
ఈ సినిమాలో రచనా విభాగం తర్వాత ఎక్కువ మార్కులు పడేది...ఎడిటర్ కే. ఇలాంటి కథల్లో ఎక్కడ ఎడిటర్ చిన్న షాట్ ఎక్కువ వదిలినా..అక్కడికే మన దృష్టి పోతుంది. ఎందుకు ఆ షాట్ వేసారా అని, అలాగని షార్ప్ గా ఉండాలని మరీ అతికి పోయి అంట కత్తెర వేసేస్తే అసలుకే మోసం వస్తుంది. అసలేమీ అర్దం కాదు.ప్రేక్షకుడి పిచ్చి చూపులు మిగులుతాయి. ఆ రెండూ జరగకుండా నీటుగా సినిమాని ఓ ప్రవాహంలా ఎక్కడా ప్రక్కకు పోకుండా ఒడిపట్టి అందించాడు ఎడిటర్. ఇక ఆ తర్వాత మిగతా డిపార్టమెంట్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. డైలాగులు జస్ట్ ఓకే. ఆర్ట్ డిపార్టమెంట్ వర్క్ కూడా బాగుంది. కెమెరా, సంగీతం… మూడ్‌ని ఇంకాస్త గాఢంగా చూపించాల్సింది అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ సోసోగా ఉన్నాయి. సిజి వర్క్ నాశిగా ఉంది. 

నటీనటుల్లో సుజాత (అనన్య), చిన్ను (దినేష్ తేజ్) ఇద్దరూ పోటీ పడి చేసారు. అలాగే మరో కీలకమైన పాత్రలో అర్జున్ కళ్యాణ్ అనే కుర్రాడు బాగా చేసారు. హూషారు ఫేమ్ దినేష్ తేజ్ లో మాత్రం అక్కడక్కడా రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ కనపడింది. మల్లేశం ఫేమ్ అనన్య మాత్రం పెద్ద కళ్లతో చక్కగా ఉంది. జర్నలిస్ట్ మూర్తి కీ రోల్ లో ఇమిడిపోయారు. TNR (ఇంటర్వూలు ఫేమ్)..వరస సినిమాలతో బిజి అయ్యేటట్లు ఉన్నారు.

ఫైనల్ థాట్
ఓ కొత్త తరహా కాన్సెప్టుతో వచ్చిన సినిమాని స్టార్స్ లేరు కదా అని వదిలేస్తే..ఆ తర్వాత అలాంటి సినిమా చేయటానికి ఎవరూ సాహసించరు. పాతనే ప్రతీ సారి కొత్తగా చూసుకుని కొత్తదనం అనుకుని మురిసిపోవాలి.
----సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.75

ఎవరెవరు...
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్
నటీనటులు:  దినేష్ తేజ్, అనన్య నాగళ్ల , అర్జున్ కళ్యాణ్ , స్పందన , మూర్తి , టీఎన్ ఆర్ , చక్రపాని , అశోక్ వర్ధన్, కార్తికేయ ప్రధాన పాత్రల్లో 
సంగీతం : కమ్రన్
సినిమాటోగ్రఫీ :బుజ్జి.కే
ఎడిటర్: నాగేశ్వర రెడ్డి బొంతల
 ఆర్ట్; జెవి,  
 పిఆర్ఓ; వంశీ శేఖర్, హరిణి సజ్జ, 
డిజిటల్ పీఆర్వో: శివ వీరపనేని, విష్ణుతేజ్ పుట్ట 
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం:హరి ప్రసాద్ జక్కా 
నిర్మాత : ప్రసాదరావు పెద్దినేని
విడుదల తేది :: మార్చ్ 5 , 2021