కథేంటి

 పీహెడీ స్టూడెంట్ సదానంద్ (సత్యదేవ్)కు సంగీతం అంటే సదా ఎలర్జీ. అది ఏ స్దాయి అంటే తన తెలివిని ఉపయోగించి సౌండ్ లెస్ ఇంజన్ తయారు చేయాలని ఆహో రాత్రాలు పరిశ్రమిస్తూంటాడు. పరితపిస్తూంటాడు. అయితే దేవుడు తిన్నమైన వాడు కాదు కదా..అతని జీవితాన్ని శబ్దమయం చేయాలని,హింసాలని ఫిక్స్ అవుతాడు. అంతే..శిరీష (ప్రియలాల్)అనే అమ్మాయిని పంపుతాడు. ఆమె వైలెన్ లో మాస్టర్ చేసేయాలని,సంగీత విధ్వాంసురాలు అయ్యిపోవాలని జీవితాశయం.  నిప్పు,నీరులాంటి వీరిద్దరూ హైదరాబాద్ లో కలుస్తారు. ఆమె వచ్చి వచ్చి మనవాడు ఉండే అపార్టమెంట్ లోనే ప్రక్క పోర్షన్ లోనే సంగీత సాధన మొదలెడుతుంది. మొదట్లో గొడవలు.. ఆ తర్వాత స్నేహం..ప్రేమ ఆటోమేటిక్ గా రోజులు గడిచేసరికి మొదలైపోతాయి. అయితే ట్విస్ట్ ఏమిటంటే వీళ్లిద్దరూ ఒకరినొకరు చూసుకోరు..ఇలాంటి వీరి ప్రేమ ఓ కొలిక్కి వచ్చిందా..ఇద్దరి జీవితాశయాలు తీరాయా..చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉంది...
వరసగా విజయాలు సాధిస్తున్న హీరో సత్యదేవ్, రామ్ గోపాల్ వర్మ దగ్గర సర్కార్ నుంచి రక్త చరిత్ర వరకు దర్శకత్వం విభాగంలో పని చేసిన మోహన్ బమ్మిడి కాంబోలో వచ్చిన చిత్రం “గువ్వ గోరింక”. వినగానే ఇంట్రస్టింగ్ గా అనిపించే ఈ కాంబినేషన్ నుంచి ఏ స్దాయి సినిమా ఎక్సపెక్ట్ చేస్తాం..మరీ రామ్ గోపాల్ వర్మ రెగ్యులర్ గా తీస్తున్న సినిమాలాంటిదయితే కాదు కదా..అయితే సినిమా చూసిన వారికి ఇదీ ఆ టైపే అనిపించటం ఖాయం. రొమాంటిక్ కామెడీ జోనర్ లో మొదలైన ఈ సినిమా మెల్లి మెల్లిగా జోనర్ న్యాయం మరిచి..ఇష్టం వచ్చినట్లు గెంతులు వేస్తుంది. ముఖ్యంగా బోర్ కు బ్రాండ్ అంబాసిడర్ లా సీన్స్ సా....గుతూంటాయి. సాధారణంగా రొమాంటిక్ కామెడీల్లో క్లైమాక్స్ లో వీళ్లిద్దరూ ఒకటి అవుతారనే విషయం ప్రేక్షకులకు ఫస్ట్ నాలుగైదు సీన్స్ లోనే అర్దమవుతుంది. అక్కడ నుంచే అసలు టాస్క్ మొదలువుంది. ఆ ఒకటి అయ్యే జర్నీనే ఆసక్తికరంగా మలచాలి. హీరో,హీరోయిన్స్ ధృక్పధాల్లోనే సంఘర్షణ పుట్టించి,చివరి వరకూ కథను నడపాలి. అలాగే ఆ సంఘర్షణ స్దాయిలను పెంచుకుంటూ పోవాలి. అదే ఇక్కడ జరగలేదు. మొదట్లో ఏదైతే కాంప్లిక్ట్స్ ఎస్టాబ్లిష్ అయ్యిందో..చివరి వరకూ అదే నడించింది. 

దానికి తోడు ఒకటి రెండు లొకేషన్స్ లోనే సినిమాని తీయటం వల్ల కథ కదిలినట్లు అనిపించదు. Turn Left Turn Right (2016) సినిమా ఆధారంగా తయారైనట్లున్న ఈ కథ ..ప్రారంభంలో ఇద్దరు విభిన్న ధృక్పధాలు కల వ్యక్తులను ప్రెజెంట్ చేయటం దాకా బాగానే నడుస్తుంది.  అయితే రాసుకున్న స్క్రిప్టు షార్ట్ ఫిలింకు సరిపోయినట్లుగా కొంత దూరం వెళ్లాక కథ అయ్యిపోయినట్లు నెట్టడం మొదలవుతుంది. సీన్స్ రిపీట్ అవుతూంటాయి. మనలో సహసం స్దాయి తగ్గిపోతూంటాయి. మౌస్ ముందుకు దానంతట అదే పరుగెడుతుంది. అయినా సినిమా పూర్తి కాదు. ఇంత పెద్ద సినిమా చూస్తున్నామా అంటే అంత లెంగ్త్ కనపడదు.

 ఏమిటీ మాయ అని తేలుకుని,కోలుకునేందుకు కొంత సమయం పడుతుంది. ఓ క్షణం కళ్లు మూసుకుని ఆలోచిస్తే అసలు కారణం అప్పుడు బోధపడుతుంది. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ లేదు అని తెలుస్తుంది. అలాగే ఈ కథని సాయిం పట్టడానికి రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వంటి కమిడియన్స్ వచ్చి పోతూంటారు. అయనను ఫలితం కనపడదు. ప్రియదర్శని ట్రాక్ ఉన్నంతలో కొంతలో కొంత బాగుందనిపిస్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్ లో హీరో,హీరోయిన్స్ బ్రేకప్ కు కారణం,రియాక్షన్ తెలిస్తే ...ఇంక ఈ సినిమా ఎందుకు ఇంతసేపు భరించామా అనిపిస్తుంది. ఇలాంటివి ఈ గువ్వ..గోరింకలో చాలింక అనేవి బోలెడు. 
 
టెక్నికల్ గా..

ఇలాంటి థిన్ లైన్ స్టోరీని ట్రీట్మెంట్ దశలోనే జాగ్రత్తగా డీల్ చేసి,సరైన సబ్ ప్లాట్ లతో ఇంట్రస్టింగ్ గా మలచాలి. అలాగే ఇలాంటి స్టోరీని ఎంగేజింగ్ నడపాలంటే దర్శకుడుకి మామూలు ప్రతిభ సరిపోదు. అయితే ఈ దర్శకుడు తొలి చిత్రం అవటం మూలనో, వేరే కారణం వల్లనో కానీ అదేమీ కనపడదు. ఫార్ములా కథని అదే స్దాయిలో సిల్లిగా డైరక్ట్ చేసుకుంటూ పోయారు. అయితే ఈ టీమ్ అదృష్టం ఏమిటంటే మంచి టెక్నీషియన్స్ దొరికారు. ఆర్ట్ డిపార్టమెంట్ కష్టం కనపడుతుంది. అలాగే కెమెరా వర్క్ కూడా కూల్ గా నీట్ గా ఉంటుంది. కాని ఎందుకో కొన్ని చోట్ల షార్ట్ ఫిలిం చూస్తున్న ఫీల్ వచ్చిందచి.  సంగీతం ఈ రొమాంటిక్ కామెడీకు ఓ ప్లెజెంట్ ఫీల్ తెచ్చింది. రీరికార్డింగ్ బాగుంది. ఎడిటర్ మాత్రం ప్రేక్షకులకు హింస పెట్టేసారు. చాలా సీన్స్ లేపేయచ్చు. అలాగే ఎమోషన్స్ ని సరిగ్గా రిజిస్టర్ కానివ్వలేదు. జగదీశ్వరరావు డైలాగులు ఎమోషన్ సీన్స్ లో తప్పించి, మిగతా చోట్ల సింపుల్ గా బాగున్నాయి. 

ఇక హీరో సత్యదేవ్ ..ఓ ప్రక్కింటి కుర్రాడులాగ కనపడ్డారు. అయితే షూటింగ్ గ్యాప్ లు వచ్చాయోమో లుక్ లో చాలా వేరియేషన్స్ కనిపించాయి. సత్యదేవ్ కు జోడీగా చేసిన అమ్మాయి మాత్రం హీరోయిన్ మెటీరియల్ కాదు. అలాగని మంచి నటి కూడా కాదు.   రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి లు అక్కడక్కడా నవ్వించారు. మధుమిత, చైతన్యలు కూడా ఓకే అనిపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 
 ఫైనల్ థాట్
ఒక్కోసారి సత్యదేవ్  వంటి నటుడు ఉన్నా సినిమాని నిలబెట్టలేడు

రేటింగ్ : 1/5 
--సూర్య ప్రకాష్ జోశ్యుల

ఎవరెవరు

నటీనటులు: సత్యదేవ్, ప్రియా లాల్, ప్రియదర్శి, చైతన్య, ప్రభాకర్, ఫిష్ వెంకట్ తదితరులు
 సంగీతం: సురేష్ బొబ్బిలి,
 కెమెరా: మైలేసం రంగస్వామి, 
ఆర్ట్: సాంబశివరావు, 
ఎడిటింగ్: ప్రణవ్ మిస్త్రి,
మాటలు: జగదీశ్వరరావు బమ్మిడి.
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ బమ్మిడి.
 నిర్మాతలు: దాము రెడ్డి కొసనం, దళం జీవన్ రెడ్డి, 
రన్ టైమ్: 1 గంట 57 నిముషాలు
విడుదల తేదీ: డిసెంబర్ 17, 2020
ఓటీటి: అమెజాన్ ప్రైమ్