కరోనా దెబ్బకు సినీ రంగం స్థంబించిపోయింది. దీంతో సినీ అభిమానులు ఎలాంటి అప్‌డేట్స్‌ లేక నిరుత్సాహంగా ఉన్నారు. అలాంటి వారికి పెళ్లి వార్తలతో జోష్ ఇస్తున్నారు టాలీవుడ్ సెలబ్రిటీస్‌. ఇప్పటికే నిఖిల్‌ లాక్‌ డౌన్‌లోనే పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్‌ను ప్రారంభించగా మరో యంగ్ హీరో రానా దగ్గుబాటి.. ఈ లాక్‌ డౌన్‌ కాలంలోనే తనకు లైఫ్ పార్టనర్‌ దొరికేసిందంటూ ప్రకటించాడు. అంతేకాదు త్వరలోనే తాను పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టుగా చెప్పేశాడు.

అయితే రానా ప్రియురాలిని పరిచయం చేయటమే ఆలస్యం దగ్గుబాటి ఫ్యామిలీ పెళ్లి పనులు ప్రారంభించేసింది. ఇటీవల రానా, మిహికాల కుటుంబ సభ్యులు కలుసుకొని నిశ్చితార్థం, పెళ్లి సంబంధించిన విషయాలను చర్చించుకున్నారు. నార్త్‌ ఇండియాలో జరిగే రోకా వేడుక తరహాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేవలం ఇరు కుటుంబాల సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ప్రైవేట్‌గా జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను రానా స్వయంగా అభిమానుల కోసం సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు.

ఈ వేడుకకు హాజరైన అక్కినేని కొడలు సమంత కూడా తన సోషల్ మీడియా పేజ్‌లో ఓ ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో అక్కినేని దగ్గుబాటి ఫ్యామిలీలకు సంబంధించిన యంగ్ జనరేషన్‌ అంతా ఉంది. వెంకటేష్‌ పిల్లలు, సురేష్‌ బాబు పిల్లలతో పాటు నాగచైతన్య కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన సమంత `2020లో బెస్ట్ న్యూస్‌ తీసుకువచ్చినందుకు థ్యాంక్స్‌` అంటూ కామెంట్ చేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.