'రంగస్దలం' సూపర్ హిట్ తర్వాత సమంత ఛాయిస్ మారిపోయింది. తన చుట్టూ తిరిగే కథలను,అదీ వైవిధ్యంగా ఉంటేనే ఒప్పుకుంటోంది. ఆ క్రమంలో 'ఓ బేబీ' సూపర్‌ సక్సెస్‌ తర్వాత '96' తెలుగు రీమేక్‌లో నటించింది సమంత. శర్వానంద్‌, సమంత జంటగా ఈ సినిమా తెరకెక్కింది. అలాగే ఓ బేబీ తర్వాత ఇప్పుడు మరో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలో కనిపించడానికి సమంత గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తమిళ దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది.ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర వైవిధ్యంగా ఉండబోతోందిట.

 గతంలో నయనతారతో మాయ, తాప్సీతో గేమ్‌ ఓవర్‌ వంటి లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు తెరకెక్కించారు అశ్విన్‌ శరవణన్‌. ఈ రెండు సినిమాలు థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగాయి. మరి సమంత నటించబోయే సినిమా కూడా థ్రిల్లర్‌ జానర్‌లోనే ఉంటుందని తెలుస్తోంది. సమంత ఈ సినిమాలో మూగ పాత్ర చేయబోతోందిట. సమంతను ఇప్పటివరకూ చూడని విధంగా ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఇక ఇలాంటి పాత్రనే అనుష్క తన తాజా చిత్రం నిశ్శబ్దంలో కూడా చేసింది. త్వరలో రిలీజ్ కాబోయే ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

 సమంతకు తెలుగు, తమిళంలో మంచి మార్కెట్‌ ఉంది కాబట్టి ఇది ద్విభాషా చిత్రంగానూ రూపొందనుంది. సమంత తొలి లేడీ ఓరియంటెడ్‌ సినిమా యు టర్న్‌ కూడా థ్రిల్లరే. ఇదిలా ఉంటే ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు సమంత. ఈ సిరీస్‌తో వెబ్‌ వరల్డ్‌లోకి అడుగుపెడుతున్నారామె.