సల్మాన్ “రాధే” రివ్యూ
. 2009లో వచ్చిన సూపర్ హిట్ 'వాంటెడ్' జ్ఞాపకాలు ను సల్మాన్, ప్రభుదేవా కలిసి తిరిగి ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. అయితే ఇన్నేళ్లులో ప్రపంచం చాలా మారిపోయింది. సల్మాన్ అభిమానులు సైతం మారుతున్నారు.
మొత్తానికి సల్మాన్ ఖాన్ తన ఫ్యాన్స్ కు ఈద్ కానుక ఇచ్చేసాడు. కరోనా టైమ్ లో థియోటర్స్ కు జనం రారని,నష్టం వస్తుందని తెలిసినా డిజిటల్ రిలీజ్ కు తెర తీసాడు. 2009లో వచ్చిన సూపర్ హిట్ 'వాంటెడ్' జ్ఞాపకాలు ను సల్మాన్, ప్రభుదేవా కలిసి తిరిగి ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. అయితే ఇన్నేళ్లులో ప్రపంచం చాలా మారిపోయింది. సల్మాన్ అభిమానులు సైతం మారుతున్నారు. మరి వీరికి ఈ సినిమా నచ్చుతుందా అనేది ప్రక్కన పెడితే.. సల్మాన్ ఫ్యాన్ కాని వారికి ఈ సినిమా ఎక్కుతుందా, అసలు ఈ చిత్రం కథేంటి.. వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి...
ముంబైలో స్కూళ్లలో, కాలేజీల్లో ఎక్కడ చూసినా,ఎటు చూసినా డ్రగ్సే. కుర్రాళ్లు,అమ్మాయిలు అంతా యువత అంతా డ్రగ్స్ కి బానిసలైపోయారు. దాంతో క్రైమ్ కూడా ఎక్కువైపోయింది. ఈ దారుణ పరిస్దితులను పోలీస్ లు కంట్రోలులోకి తేలేకపోతూంటారు. ఎందుకంటే...వీటిన్నటి వెనుక ఉన్న పెద్ద శక్తి,డ్రగ్ డీలర్ రాణా(రణదీప్ హుదా). అతన్ని కంట్రోలు చేయటానికి పోలీస్ డిపార్టమెంట్ శక్తి చాలదు. పెరిగిపోతున్న క్రైమ్ రేటుని అణిచివేయలేక డిపార్టమెంట్ చేతులెత్తేస్తుంది. ఈ టైమ్ లో ఈ డ్రగ్ దందాకు చెక్ చెప్పాలంటే ఒకే..ఒకడు ఉన్నాడని నిర్ణయానికి వస్తారు. అతనే రాధే(సల్మాన్ ఖాన్). అతను ఓ ఎన్ కౌంటర్ స్పెషలిస్టు. అప్పటికే 97 ఎనకౌంటర్స్ చేసేసి, 23 సార్లు ట్రాన్సఫర్ అయ్యి ఉంటాడు. అయితే అతను ప్రస్తుతం ఓ కేసులో తప్పు చేసి సస్పెండ్ అయ్యి ఉంటాడు. అతనిపై ఉన్న సస్పెన్షన్ ఎత్తేసి అతడికి ఈ కేసు అప్ప చెప్తారు. సిటీని క్లీన్ చేయమని చెప్తారు. రంగంలోకి దిగిన రాధే.. తన దైన సిగ్నేచర్ డాన్స్ స్టెప్ లువేస్తూ, డైలాగులు చెప్తూ, డ్రగ్ నెట్ వర్క్ ని తవ్వటం మొదలెడతాడు. ఆ క్రమంలో అత్యంత దుర్మార్గుడైన రాణా (రణదీప్ హుడా) గురించి తెలుస్తుంది. అక్కడ నుంచి అతనపై యుద్దం ప్రకటిస్తాడు. అప్పుడు రాధే ఏం చేసాడు..ముంబయిని డ్రగ్ ఫ్రీగా ఎలా చేయగలిగాడు, రాధే బ్యాక్ స్టోరీ ఏమిటి, దియా (దిశా పటాని) పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ ..
ఈ కథ చదివినా ,సినిమా చూసినా..ఇలాంటింది తయారు చేయలేమా అని ఔత్సాహికలకు అనిపించటంలో వింతలేదు. అయితే ఇంతకన్నా వింతేమిటంటే...ఈ సినిమా 2017 లో వచ్చిన సౌత్ కొరియన్ ఫిల్మ్ The Outlaws కు రీమేక్ కావటం. ఇంతోటి కథ మళ్లీ కొనుక్కురావాలా అనిపించవచ్చు. అయితే ఆ సినిమా చూసాకే...ఇలాంటి కథ చెయ్యచ్చు ఈ రోజుల్లో కూడా అనే ధైర్యం వచ్చి ఉండవచ్చు దర్శకుడుకి, హీరోకి. ఈ సౌత్ కొరియా సినిమాకు రజనీకాంత్ దర్బార్ కలిపితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చి ఉండవచ్చు. అంతే ఓ స్క్రిప్టు తయారైంది. మన ముందు సినిమా రెడీ అయ్యి వాలింది.
ఇక ఈ సినిమాలో కథ వెతకటం అంటే సల్మాన్ ఖాన్ ఇమేజ్ ని శంకించటమే అన్నట్లుగా సాగుతుంది. అతని మెగా స్టార్డమ్ మీదే మొత్తం డిపెండ్ అయ్యిపోయారు. స్క్రిప్టు మొత్తం సల్మాన్ ఖాన్ ఎలివేషన్ చేసే సీన్స్ తో నింపేసారు. ఓ పదిహేను ఏళ్ల క్రితం సినిమా ముచ్చటపడి రీమేక్ చేసినట్లుగా సీన్స్ వస్తూంటాయి. అక్కడక్కడా తమిళ అతి సీన్స్ కనపడి డైరక్టర్ ఫలానా ప్రభుదేవా అని గుర్తు చేస్తూంటాయి. అంతేకాదు సూపర్ హ్యూమన్ ఎలిమెంట్స్ కూడా కనపడుతూంటాయి. అఫ్ కోర్స్ అవన్నీ సల్మాన్ అభిమానులు కోసమే పెట్టి ఉంటారు. అలాగే ఫన్ జనరేట్ చేయటానికి ఫ్రీ హ్యాండ్ తీసుకున్నారు.అలాగే ఎమోషన్ సీన్స్ కూడా చాలా చప్పగా సాగాయి. క్లైమాక్స్ థియోటర్ లో చూస్తే ఎలా ఉండేదో కానీ చిన్న తెరపై చూస్తూంటే ...ఇంత యాక్షన్ అవసరమా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను గజనీని ప్రక్కన పెట్టుకుని రాసుకున్నారు. అదీ ఫన్ పెద్దగా పండలేదు. ముఖ్యంగా హీరో,విలన్ మధ్య ఉంటే పిల్లి,ఎలుకా ఆటలేదు. హీరో కు ఎదురేలేకుండా పోతుంది. జాకీష్రాఫ్ క్యారక్టర్ అయితే అర్దం చేసుకోవటమే కష్టం. ఎందుకు పెట్టారో స్క్రిప్టు రాసిన వాళ్లకే తెలియాలి.
నటీనటుల్లో... సల్మాన్ ఖాన్ మేనరిజమ్స్.. స్క్రీన్ ప్రెజెన్స్ మీదే ఎక్కువ డిపెండ్ అయ్యారు. ఫెరఫార్మెన్స్ అంటే ...అంత నటనను చూపించే సీన్స్ ఎక్కడున్నాయి సినిమాలో. ఇక దిశాపటాని కేవలం గ్లామర్ షోనే. అంతకు మించి ఆమెనుంచి ఆశించేదేమీ లేదు. రణ్ దీప్ హుడా పాత్ర తేలిపోయింది.
టెక్నికల్ గా...
సిటీ మార్ సాంగ్ కి సల్మాన్ వేసిన స్టెప్పులు హిందీ వాళ్ళకు నచ్చుతాయో కానీ బన్ని నిచూసిన కళ్లతో చూడలేము. ఇక డబ్బులు బాగా ఖర్చుపెట్టారని అర్దమవుతుంది. సల్మాన్ సినిమాకు ఆ మాత్రం ఉండాల్సిందే. ఇక ఎడిటింగ్ కూడా ఓ ఇరవై నిముషాలు లేపేయచ్చు అనిపిస్తుంది. ప్రభుదేవా కేవలం సల్మాన్ ఫ్యాన్స్ కోసమే ఈ సినిమా అనే సందేహం వచ్చేలా డైరక్షన్ సాగుతుంది.
ఫైనల్ థాట్
పాత సినిమాలో పాత సల్మాన్ అంతే..
Rating:2.5
---సూర్య ప్రకాష్ జోస్యుల