'చిత్రలహరి' మూవీ రివ్యూ
సక్సెస్ లేకుండా వరస ప్రయత్నాలు చేయటం అంటే మాటలు కాదు...అది గత ఆరు సినిమాల నుంచీ సాయి తేజ చేస్తూనే ఉన్నారు. డైరక్టర్స్ ని, కథలను మారుస్తున్నా కలిసిరావటం లేదు.
--సూర్య ప్రకాష్ జోశ్యుల
సక్సెస్ లేకుండా వరస ప్రయత్నాలు చేయటం అంటే మాటలు కాదు...అది గత ఆరు సినిమాల నుంచీ సాయి తేజ్ చేస్తూనే ఉన్నారు. డైరక్టర్స్ ని, కథలను మారుస్తున్నా కలిసిరావటం లేదు. ఈ నేపధ్యంలో ఉన్నది ఒకటే జిందగి తో దెబ్బతిని, హిట్ కోసం ఎదురుచూస్తున్న కిషోర్ తిరుమలతో యూత్ కు నచ్చే కథంటూ ఈ సినిమా చేసాడు. ట్రైలర్స్, టీజర్స్ జనాల్లోకి బాగానే వెళ్లాయి. ఓ కొత్త పాత్రలు, కొత్త కథతో వస్తున్న ఫీల్ ని తీసుకొచ్చాయి. మరి వాటిని ఈ సినిమాలో కంటిన్యూ చేసిందా...? డైరక్టర్ కు, హీరోకు హిట్ ఇచ్చిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి..
కోర్ట్ లో జడ్జి ముందు నిందితుడుగా నిలబడతాడు విజయ్ కృష్ణ (సాయిధరమ్‌తేజ్). జడ్జిమెంట్ వచ్చేలోగా కథ ప్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. జీవితంలో విజయం ఎరగని వ్యక్తి ఎవరని అడిగితే విజయ్ కృష్ణ (సాయిధరమ్‌తేజ్) ని చూపాల్సిన సిట్యువేషన్. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేసిన అతనికి తండ్రి (పోసాని కృష్ణమురళి) సపోర్ట్ ఉన్నా కాలం కలిసిరాదు..అతని టాలెంట్ వెలుగులోకి రాదు. అలా నిరాశ అనే చీకట్లో మగ్గిపోతున్న అతని జీవితంలోకి ఓ టార్చిలైట్ లాగా లహరి (కల్యాణి ప్రియదర్శన్) వస్తుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకుని పాటలు పాడుకుంటాడు. ఆమె కూడా ఫ్రెంచ్ నేర్చుకుంటూ విజయ్ కృష్ణతో ప్రేమలో పడుతుంది. అయితే ఇక్కడా అతనికి ఫెయిల్యూరే. ఆమెకు సొంత తెలివిలేకపోవటంతో అందరిపై ఆధారపడే మనస్తత్వమే ప్రేమను దెబ్బ తీస్తుంది.
తన చిననాటి స్నేహితురాలు స్వేచ్ఛ (నివేదా పేతురాజ్).. నీకు విజయ్ అబద్దాలు చెప్తున్నాడంటే ఆ మాటలు నిజమే అని ప్రూవ్ చేసుకుని... విజయ్‌పై నమ్మకాన్ని కోల్పోయి బ్రేకప్ చెప్పేస్తుంది. పూర్తిగా నిరాశపడిపోతాడు. తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో స్టార్టప్ ఐడియా ‘యాక్సిడెంట్ ఎలర్ట్ సిస్టమ్’ని ఎలాగైనా క్లిక్ చేయాలనుకుంటాడు. అందుకోసం ఇన్వెస్టర్ ని కలుస్తాడు.
వారు ఎవరూ దాన్ని నమ్మి పెట్టుబడి పెట్టడానికి ముందుకు రారు. ఈ నేపధ్యంలో ‘యాక్సిడెంట్ ఎలర్ట్ సిస్టమ్’ ఎలా పనిచేస్తుందో ప్రపంచానికి చూపించటం కోసం తనకు తనే యాక్సిడెంట్ కు ఎదురెళ్లతాడు. అప్పుడు ఏం జరిగింది. తన స్టార్టప్ పనిచేసిందా..? కోర్ట్ కు ఎందుకు వచ్చాడు..? తిరిగి తన గర్ల్ ప్రెండ్ తనకు దగ్గరయ్యిందా..? గ్లాస్ మేట్ (సునీల్) , తమిళ తంబి (వెన్నెల కిశోర్) ల పాత్రలేమిటి..? వంటి విషయాలు తెరపై చూడాల్సిందే.
ఎలా ఉంది..
'అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది' అని యూత్ కు సందేశమిద్దామని మెదలెట్టిన కథ ఇది. అయితే అపజయాలు ఎక్కువై గెలుపు రాగం తక్కువైంది. సీన్స్, డైలాగులు ఈ కాలం యూత్ ని రిప్రెంజెంట్ చేసినట్లు అనిపించినా సినిమాలో ఎమోషనల్ డెప్త్ మిస్సవటంతో పెద్దగా కనెక్ట్ కాము. సాయి తేజ లాంటి ఎనర్జీ ఉన్న హీరో నుంచి ఇలాంటి డల్ కథను ఆశించం.
ప్చ్ ...కాంప్లిక్ట్ వచ్చేసరికే కథ ముగిసింది..
రెగ్యులర్ మసాలా సినిమాలకు దూరంగా వెళ్లి డైరక్టర్ ఏదో చెప్పాలనుకునే ప్రయత్నం అయితే చేసారని అర్దమవుతుంది. అయితే ఆ చెప్పటం అనేది డైరక్ట్ గా కాకుండా డైరక్టోరియల్ టచ్ తో చెప్తే బాగుండేది. అలా చెయ్యకపోవటంతో చిత్రలహరి కాస్తా సూక్తి ముక్తావళి రూపం సంతరించుకుంది. ముఖ్యంగా సినిమాలో కాంప్లిక్ట్ పాయింట్ కు కథ చేరేసరికే క్లైమాక్స్ కు వచ్చేసింది. క్యారక్టర్స్ , ఎపిసోడ్స్ కనపడతాయి కానీ కథలో వచ్చే ముఖ్యమైన మలుపు కనపడదు. ప్రేమించిన అమ్మాయి బ్రేకప్, తన స్టార్టప్ ని ఎవరూ ఎంకరేజ్ చేయకపోవటం అనేవి కథలో ప్రధానమైన మలుపుగా దారి చేసుకోవు. సెకండాఫ్ లో తను తయారు చేసిన యాక్సిడెంట్ ఎలర్ట్ సిస్టమ్ ని తనే స్వయంగా యాక్సిడెంట్ క్రియేట్ చేసుకుని ప్రూవ్ చేసుకోవాలి అనుకునే దాకా కథలో వేగం రాదు.
వాస్తవానికి అలా ప్రూవ్ చేసుకునేందుకు యాక్సిడెంట్ ని ఆహ్వానించినప్పుడు జరిగే సంఘటనలతో కథ మలుపు తిరిగి, అక్కడ నుంచి వచ్చే సమస్యలతో వచ్చే సెకండాఫ్ ఉంటే ఇంట్రస్టింగ్ గా ఉండేదేమో. అలా జరగకుండా కాంప్లిక్ట్ పాయింట్ కథలోకి వచ్చేసరికే క్లైమాక్స్ వచ్చేసి, సినిమా ముగిసింది. అలాగే ప్రారంభం ఇంట్రస్ట్ గా అనిపించినా మెల్లిమెల్లిగా డ్రాప్ అవతూ ..సెంకడాఫ్ లో మరీ డల్ అయిపోయింది. దర్శకుడు డైలాగులు మీద పెట్టిన శ్రద్ద..స్క్రీన్ ప్లేని ఇంట్రస్టింగ్ గా నడపటంలో పెట్టలేదనిపించింది.
తేజూ కష్టపడ్డా....
గెడ్డం, ఒళ్లు పెంచి మరీ ఈ చిత్రంలో కాస్త డిఫరెంట్ గా కనపడ్డాడు తేజు. కానీ కథ అతనికి కలిసి రాలేదు. ఎంతసేపూ మందుకొట్టడం, నిరాశలో కూరుకుపోతూ మనకు నీరసం తెప్పించటం తప్ప చేయగలిగిందేం కనపడలేదు. ఇక చెప్పుకోడానికి ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా ...వాళ్లూ ఏదో క్యారక్టర్ ఆర్టిస్ట్ లులా కనపడతారే కానీ కథలో కలవరు.వాళ్ళతో హీరో .. కెమిస్ట్రీ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అయితే తేజూ వరకు నటనలో మెచ్యూరిటీ కనపిస్తుంది. విజయ్ పాత్ర ని తన తన సొంత కెరీర్ తో అన్వయించుకన్నాడో ఏమీ కానీ సాయి తేజ్ బాగా చేసారు.
టైటిల్ కు కథకు లింకుందా?
ఇక ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయగానే చాలా మంది ఇది తొంభైల నాటి కథ అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదు. వాస్తవానికి సినిమా కథకు , టైటిల్ కు పెద్ద గా సంబంధం లేదు. అయితే వేర్వేరు సినిమా పాటలు చిత్రలహరి (దూర్‌దర్శన్ కార్యక్రమం)లో ఎలా ప్రసారమవుతాయో, అలా వేర్వేరు జీవితాలు కలిసిన కథ అంటూ ప్రారంభంలోనే ‘చిత్రలహరి’ పేరు వెనక విషయాన్ని దర్శకుడు రివీల్ చేసి చెప్పాడు. కాబట్టి అలా అర్దం చేసుకోవాలి.
టెక్నికల్ గా..
ఈ సినిమా కథలో విషయం లేకపోయినా.. దేవీ శ్రీ రీరికార్డింగ్ చాలా వరకూ కాపాడగలిగింది. కెమెరా డిపార్ట్ మెంట్ అద్బుతం అనలేం కానీ ఓకే. ల్యాగ్ సీన్స్ లేకుండా ఎడిటింగ్ లో మరింత షార్ప్ గా ఉండాల్సింది. ఫస్టాప్ లో సునీల్, సెంకాడఫ్ లో వెన్నెల కిషోర్ పంచిన కామెడీ సినిమాకి ప్లస్ అయ్యాయి.
ఫైనల్ థాట్..
సినిమాలో మెసేజ్ ఉండాలి కానీ.. సినిమానే మెసేజ్ కాకూడదు
తెర ముందు..వెనక
సినిమా: చిత్ర లహరి
సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సీవీ మోహన్
తారాగణం: సాయితేజ్, నివేదా పెతురాజ్, కల్యాణి ప్రియదర్శన్, పోసాని కృష్ణమురళి, సునీల్, వెన్నెల కిశోర్ తదితరులు
ఛాయాగ్రహణం: కార్తిక్ ఘట్టమనేని
ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
కూర్పు: శ్రీకర్ ప్రసాద్
రచన, దర్శకత్వం: కిశోర్ తిరుమల
Rating: 2/5