మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ లు హీరోలుగా దర్శకుధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం)  టైటిల్ తో ఓ  సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు డబ్బై శాతం పూర్తైంది. ఇంకా ముప్పై శాతం బాలెన్స్ ఉంది. లాక్ డౌన్ తో షూటింగ్ ఆపుచేసారు. అయితే కరోనా ప్రభావం తగ్గేదాకా ఇలాంటి భారీ సినిమాలు షూటింగ్ లు కష్టమే. ఎందుకంటే ఎక్కువ మంది యూనిట్ అవసరం అవుతారు. కాంబినేషన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ నేపధ్యంలో ఎప్పటి నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుందనేది ఇప్పటిదాకా ఫిక్స్ కాలేదు. దాంతో ఆ ఇంపాక్ట్ రిలీజ్ తేదీపై పడనుంది.

వాస్తవానికి ఈ ఏడాది జులై 30న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో జనవరి 8, 2021కి విడుదల పోస్ట్ ఫోన్ చేసారు. ఇక ఇప్పుడు సంక్రాంతికి కూడా ఆర్ ఆర్ ఆర్ వచ్చేది కష్టమే అని నిర్మాత దానయ్య చెప్పారు. ఇంకా 30శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉండగా ఇలాంటి సిట్యువేషన్ లో పూర్తి చేయడం చాలా కష్టం అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఓ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఈ నేపధ్యంలో  మరో నాలుగు నెలలు ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదాపడనుంది అని తెలుస్తుంది.

 ఈ సినిమాలో ఆలియా భట్, అజయ్‌ దేవగన్, సముద్రఖని కీలక పాత్రలు చేస్తున్నారు.   అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. చరణ్‌ పుట్టినరోజుకి ఓ టీజర్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర టీమ్. ఈ టీజర్‌లో రామ్‌ చరణ్‌ యుద్ధ విద్యలు నేర్చుకుని యుద్ధానికి తయారవుతున్నట్టు కనిపించారు.

ఈ సినిమాలో బాక్సింగ్‌కి సంబంధించి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఈ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని అంటున్నారు యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ కుల్దీప్‌. ‘‘రాజమౌళితో సినిమా చేయడం  సంతోషంగా, గర్వంగా ఉంది. ఇందులో బాక్సింగ్‌ కి సంబంధించిన పలు సన్నివేశాలు ఉన్నాయి. ఆ ఫైట్స్‌ ని  నేనే డిజైన్‌ చేసాను. స్క్రీన్‌ మీద సూపర్‌ గా ఉంటాయి. ‘బాహుబలి’లా ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది’’ అని పేర్కొన్నారు కుల్దీప్‌.  ఈనెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు రోజు నేపథ్యంలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో రానుంది. ఐతే ఈ వీడియో పై సందిగ్దత కొనసాగుతుంది.