కరోనా ప్రభావం సినీ పరిశ్రమ మీద చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే 70 రోజులుగా షూటింగ్‌లు, సినిమా రిలీజ్‌లు లేకపోవటంతో దేశవ్యాప్తంగా ఇండస్ట్రీ వేల కోట్ల రూపాయలు నష్టపోయింది. తిరిగి పరిస్థితి ఎప్పటికి చక్కబడుతుందో ఇప్పట్లో చెప్పలేని పరిస్థితి, ఈ నేపథ్యంలో సినీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే షూటింగ్ లొకేషన్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

అయితే ఒకవేళ ప్రభుత్వాలు పర్మిషన్‌ ఇచ్చినా థియేటర్లకు జనం ఏ మేరకు వస్తారు అన్నది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. దీంతో దర్శక నిర్మాతలు నిర్మాణ ఖర్చులను వీలైనంతగా తగ్గించుకునే పనిలో పడ్డారు. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఇదే పనిలో ఉన్నాడట. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాకు సంబంధించి కాస్టింగ్ కటింగ్‌ మీద దృష్టి పెట్టారట. అయితే ఒక వేళ నిర్మాణ వ్యయం తగ్గిస్తే అవుట్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ పడుతుందన్న ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్.

అందుకే నిర్మాణ వ్యయంపై ప్రభావం పడకుండా కేవలం పారితోసికాలు తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారట ఆర్ఆర్ఆర్‌ టీం. ఈ సినిమాకు పనిచేస్తున్న తారలంతా భారీ పారితోషికాలు అందుకుంటున్నారు. అందుకే వారి పారితోషికాల్లో కోత పెడితే నిర్మాత సేఫ్‌ అవుతాడని భావిస్తున్నారట. అయితే ఈ ఆలోచనకు ఎంత మంది తారలు సహకరిస్తారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ పరిస్థితులను రాజమౌళి ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.

పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌, హాలీవుడ్ భామ ఒలివియా మోరిస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్‌ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.