కరోనా వైరస్‌ సినీ రంగాన్ని కుదిపేసింది. సినిమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిలిచిపోవటంతో ఇండస్ట్రీ స్థంభించిపోయింది. తాజాగా ప్రభుత్వాలు లాక్‌ డౌన్‌ విషయంలో సడలింపులు ఇస్తుండటంతో సినీ రంగంలో కూడా తిరిగి షూటింగ్‌లు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. చిరంజీవి ఆధ్వర్యంలో సినీ పెద్దలంతా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో దర్శక ధీరుడు రాజమౌళి కూడా కీలకంగా పాల్గొన్నాడు.

ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు రావటంతో చిత్ర నిర్మాతలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి కూడా ఆర్ఆర్ఆర్‌ సినిమాను తిరిగి ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

అంతేకాదు ఈ వారంలోనే షూటింగ్ కూడా ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. ఎన్టీఆర్, రామ్ చరణ్‌ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను పీరియాడిక్ జానర్‌లో రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్‌ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.