భారతీయ చిత్ర పరిశ్రమను ఒక కుదుపు కుదిపిన బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ లింక్స్ ప్రకంపనలు రేపుతోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా కాల్ లిస్ట్‌లో తెలుగు సినీ హీరోలు, హీరోయిన్ల పేర్లు బయటకు వస్తుండటం సంచలనం రేపుతోంది.

రియాతో డ్రగ్స్ లింక్ వ్యవహారంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం వికారాబాద్‌ పరిసరాల్లో జరుగుతున్న షూటింగ్‌లో రకుల్ పాల్గొంటున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో ఆమె పేరు బయటకు రాగానే షూటింగ్ స్పాట్ నుంచి రకుల్ వెళ్లిపోయారు.

జూబ్లీ‌హిల్స్‌లోని ఆమె ఇంటి నుంచి మూడు రోజుల క్రితం షూటింగ్ నిమిత్తం బయటకు వెళ్లారు రకుల్. డ్రగ్స్ వ్యవహారంలో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇస్తున్నారు ఆమె పర్సనల్ మేనేజర్. గతంలో తెలంగాణ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ బృందం అనేకమంది తెలుగు సినీ ప్రముఖుల్ని విచారించిన సంగతి తెలిసిందే.

తాజాగా రియా అరెస్ట్‌తో బయటపడ్డ డ్రగ్స్ వ్యవహారం మళ్లీ టాలీవుడ్‌ను షేక్ చేయబోతోందా అనే చర్చ జరుగుతోంది. డ్రగ్స్ కేసులో మూడు రోజుల పాటు రియాను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ప్రశ్నించారు.

ఆ విచారణలో రియా ఇచ్చిన పేర్లు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దీంతో వీరిని కూడా ఎన్సీబీ అధికారులు విచారించే అవకాశం వుందని తెలుస్తోంది. మరోవైపు ఎన్సీబీ విచారణలో రియా చక్రవర్తి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

కొకైన్, ఎల్ఎస్‌బీ, మారిజోనా వంటి డ్రగ్స్‌ను కొందరు బాలీవుడ్ స్టార్స్ తీసుకునేవారని తెలిపారు. లోనావాలాలోని సుషాంత్ ఫామ్ హౌస్‌లో డ్రగ్ పార్టీలు జరిగేవని వెల్లడించింది. అయితే వాటికి తాను ఎప్పుడూ వెళ్లలేదని సుశాంత్ ఫాం హౌస్‌లో తరచూ డ్రగ్ పార్టీలు జరిగేవని చెప్పింది.

అయితే బాలీవుడ్‌కు, టాలీవుడ్‌కు, శాండిల్‌వుడ్‌కు డ్రగ్స్ లింక్ ఏమైనా వుందా అన్న కోణంలో ఎన్‌సీబీ విచారణ చేస్తోంది. కాగా.. నటి మాధవీలత ఇటీవల టాలీవుడ్ పై డ్రగ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ లో కొందరు నటులు, ప్రముఖులు ప్రైవేట్ పార్టీలలో డ్రగ్స్ వాడుతున్నారని ఆరోపించడం జరిగింది. పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు పార్టీలలో డ్రగ్స్ వాడతారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

బాలీవుడ్ లో మాదిరి టాలీవుడ్ లో కూడా డ్రగ్ కల్చర్ ఉందని , దీనిపై నార్కోటిక్స్ డిపార్ట్మెంట్, తెలంగాణా ప్రభుత్వం దృష్టిసారించాలని కోరారు. అయితే ఈ ఆరోపణలకు ఎక్సైజ్ శాఖ స్పందించింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదు, ఇప్పటికే కొంత మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అనుమానితులపై కన్నేసి ఉంచామని తెలిపింది.