బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణానికి సంబంధించిన విచారణ రోజుకో మలుపు తిరుగుతుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటుడు అర్ధాంతరంగా తనువు చాలించటంతో ఆయన మరణానికి కారణాలు విశ్లేషించే పనిలో ఉన్నారు అధికారులు. ముందుగా బాలీవుడ్‌ ఇండస్ట్రీలోని మాఫియా కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయన్ను వరుసగా భారీ ప్రాజెక్ట్‌ల నుంచి తొలగించటంతో తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడినట్టుగా విమర్శలు వినిపించాయి.

అయితే ఇటీవల సుశాంత్ తండ్రి కృష్ణ కుమార్ సింగ్, సంచలన ఆరోపణలు చేశాడు. గర్ల్‌ ఫ్రెండ్ రియా చక్రవర్తి కారణంగానే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన పోలీసు కంప్లయింట్ కూడా ఇవ్వటం సంచలనంగా మారింది. రియా, సుశాంత్‌ను మానసికంగా వేదించిందని, అతని డబ్బు వాడుకుందని ఆయన కంప్లయింట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు సుశాంత్ అనారోగ్యానికి కూడా కారణం రియానే అని, తనని కుటుంబ సభ్యులను  కూడా కలవకుండా రియా అడ్డుకుందని కేకే సింగ్ ఆరోపించారు.

తాజాగా జేడీయూ నేత మహేశ్వర్‌ హజరీ కూడా రియా మీద ఇలాంటి ఆరోపణలే చేశారు. రియా ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌ అని, ఆమె విష కన్యలా వ్యవహరించిందని ఆయన తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. అంతేకాదు సుశాంత్‌ది ముమ్మాటికీ హత్యే అని, దీనిపై పూర్తిగా స్థాయిలో విచారణ జరిపి అసలు దోషులను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సుశాంత్‌ కేసులు ముంబై పోలీసులు తీరు అనుమానాస్పదంగా ఉందన్న అభిమాప్రాయం వ్యక్తం చేశారు.