వరుస బయోపిక్ లతో హంగామా చేస్తున్న  ఆర్జీవీ `పవర్ స్టార్` అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయ జీవితాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా అచ్చం పవన్ లానే ఉన్న ఒక టిక్ టాక్ స్టార్ ని సెలెక్ట్ చేసుకుని షూటింగ్ ప్రారంభించేస్తున్నాడు. మరో ప్రక్క  సదరు టిక్ టాక్ స్టార్ ఎవరికీ కనిపించకుండా మాయమయ్యాడని ప్రస్తుతం ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో పోస్టర్స్ మీద పోస్టర్స్ వదులుతూ అగ్గి రాజేస్తున్నారు వర్మ.

ఆ క్రమంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు అప్ డేట్లను, షూటింగ్ చిత్రాలను ఆయన విడుదల చేశారు. ఇక, ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్న ఆయన, సినిమా విడుదల తేదీపైనా ఓ డెసిషన్  వచ్చేశారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.పవన్ కల్యాణ్ నటించిన 'అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి', 'గోకులంలో సీత' వంటి సినిమాల తరువాత తొలి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, పవన్ స్టామినాను ఫ్యాన్స్ కు తెలిపిన 'తొలిప్రేమ' చిత్రం విడుదలైన జూలై 24నే తాను నిర్మిస్తున్న 'పవర్ స్టార్'ను విడుదల చేయాలని వర్మ భావిస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక ప్రకటన ఏదీ వర్మ నుంచి వెలువడలేదు. 

అయితే అదే కనుక నిజమైతే వర్మ కు పవన్ అభిమానుల నుంచి సెగ తగలక తప్పదు. ఇప్పటికే ట్విట్టర్, ఫేస్ బుక్ లలో వర్మను తిట్టిపోస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'పవర్ స్టార్' అప్‌డేట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. టైటిల్ మొదలుకొని అన్ని సన్నివేశాల్లోనూ వర్మ టార్గెట్ పవన్ కళ్యాణ్ అని స్పష్టంగా తెలుస్తోంది.