`క్లైమాక్స్` రివ్యూ‌.. ఈ బోర్‌ను భరించటం వర్మ వల్ల కూడా కాదు!

కొత్త టెక్నాలిజీలను అందిపుచ్చుకోవటంలో ఎప్పుడూ ముందుంటారు రామ్ గోపాల్ వర్మ. వ్యూ ఇంత అని రేటు ఫిక్స్ చేసి ఓటీటి ఫ్లాట్ ఫామ్ ద్వారా సినిమా రిలీజ్ చేసిన ఘనత ఈయనదే. అమెరికన్ అడల్ట్ స్టార్ మియా మాల్కోవా ప్రధాన పాత్రలో తీసిన క్లైమాక్స్ చిత్రం హాట్ కంటెంట్ ఉందని పబ్లిసిటీ కావటంతో జనాల్లో బాగానే నానింది..చూడాలనే ఆసక్తి రేపింది.

RGV Climax movie review

కొత్త టెక్నాలిజీలను అందిపుచ్చుకోవటంలో ఎప్పుడూ ముందుంటారు రామ్ గోపాల్ వర్మ. వ్యూ ఇంత అని రేటు ఫిక్స్ చేసి ఓటీటి ఫ్లాట్ ఫామ్ ద్వారా సినిమా రిలీజ్ చేసిన ఘనత ఈయనదే. అమెరికన్ అడల్ట్ స్టార్ మియా మాల్కోవా ప్రధాన పాత్రలో తీసిన క్లైమాక్స్ చిత్రం హాట్ కంటెంట్ ఉందని పబ్లిసిటీ కావటంతో జనాల్లో బాగానే నానింది..చూడాలనే ఆసక్తి రేపింది. వర్మ తీసే సినిమాల మీద నమ్మకం తగ్గిపోయినా..ఎక్కడో చిన్న ఆశ మినుకుమంటూ ఈ సినిమా చూసే దిశగా ప్రేరేపించింది.ఇంతకీ  క్లైమాక్స్ ..ఎలా ఉంది..అసలు కథేంటి..చూడదగ్గ కంటెంట్ ఉన్న ఫిల్మేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి:
''అసహజమైన విషయాలని మనం వివరించి చెప్పలేం. ఒకవేళ వివరించగలిగితే అది అసహజమైనది కాదు'' అనే కొటేషన్ తో మొదలయ్యే ఈ సినిమాలో ..ఓ జంట (మియా మాల్కోవా, ఆమె ప్రియుడు రెనాన్ సేవరో ) ఎంజాయ్ చేయటం కోసం ఎక్కడా దొరకనట్లు ఎడారి ట్రిప్ కు వెళ్తారు. అక్కడ డోంట్ ఎంటర్ అనే బోర్డ్ ఉన్న ప్లేస్ ఉంటుంది. వీళ్లిద్దరు ఏదో ఇన్విస్టిగేషన్ ఆఫీసర్లు లాగా డోంట్ ఎంటర్ అన్నా..డోంట్ కేర్ అని లోపలకి వెళ్తారు. ఆ ఎడారిలో ఉన్న ఒయాసిస్ దగ్గర రొమాన్స్ చేసుకోవడం మొదలెడతారు. సర్లే వచ్చిన పని అదే కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటే...ఈ లోగా అక్కడ నుంచి మరీ అసహజనాకి అమ్మ..బాబు లాంటి సిన్స్ మొదలవుతాయి. 

ఎడారిలో రొమాన్స్ చేసుకుంటున్న ఆ జంట ఉన్న చోటకి బైక్ లపై రైడింగ్ కి కొంతమంది వస్తారు. వచ్చిన వాళ్లంతా ఇంకా వింతగా ఉంటారు. వాళ్లంతా కలిసి ఒక అమ్మాయిని వెంబడించి మాయమవుతారు. సర్లే ఈ గొడవ మనకెందుకు మనం వచ్చింది రొమాన్స్ కు కదా అని మన జంట మరో చోటకు వెళ్తారు.అక్కడ ఓ గుడిస లాంటి ఇంట్లోకి వెళ్లి రొమాన్స్ మొదలెట్టగానే ఒక చిన్న కుర్రాడు సెల్ ఫోన్ లో షూట్ చేస్తాడు. (వాడూ ఏదన్నా ఓటీటి ప్లాట్ ఫామ్ ఓపెన్ చేసి ఈ వీడియో పెట్టి డబ్బు వసూలు చేద్దామనే ఐడియాలో ఉన్నాడేమో) 

దాంతో మన హీరోకు మండుతుంది. తీస్తే వర్మ తీయాలి లేక వేరే వాళ్లు తీయకూడదు అన్నట్లుగా ఆ పిల్లాడి నుండి మొబైల్ తీసుకునే ప్రయత్నంలో జరగిన పెనుగులాటలో పిల్లాడు చనిపోయినట్లుగా క్రిందపడిపోతాడు. ఇదంతా చూసిన మన మాల్కోవా... పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటుంది. ఆ ఎడారిలో అప్పుడు వాళ్లకో పోలీస్ స్టేషన్ అనే బోర్డ్ ఉన్న ఇల్లు కనపడుతుంది. అక్కడ నుంచి వాళ్లు ఎస్సై కోసం వేరే చోటకు వెళ్లటం.. అక్కడ కొంతమంది..ఈ జంటమీద ఎటాక్ చేయటం జరుగుతుంది.

హీరోని వేరే చోట ఎడారిలో పడేసి, మాల్కోవా ని చంపేసే ప్రయత్నం చేస్తారు. అప్పుడు హీరో గారు వచ్చి వాళ్ల మీద ఎటాక్ చేస్తారు. అప్పుడు అనుకోనిది జరుగుతుంది. మాల్కోవా ని తీసుకెళ్లి సేవ్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం ప్రయత్నంలో ఓ వింత విషయం బయిటపడుతుంది. అక్కడ నుంచి ఏం జరుగుతుంది. అసలు మాల్కోవా కు ఏమైంది... అనేదే ఈ సినిమాలో ఉన్న ఏకైక ట్విస్ట్. అది తెలియాలంటే  క్లైమాక్స్ సినిమా క్లైమాక్స్ చూస్తే సరిపోతుంది. 

ఎలా ఉంది:
ఈ సినిమా చూస్తూంటే రకరకాలుగా ఉంటుంది. ఓ సారి హారర్ అనుకుంటాం. మరో సారి రొమాంటిక్ సినిమా అనుకుంటాం.. వేరొకసారి.. ఇదేదో అర్దం పర్దం లేని సినిమా అనుకుంటాం. క్లైమాక్స్ కు వచ్చాక... వర్మ.. ఆమెతో ఓ రోజులో కాలక్షేపానికి చుట్టేసిన వీడియో అని, ఆర్ ఆర్ కలిపి అందంగా ప్యాక్ చేసి మన మీదకు వదిలాడని అర్దం చేసుకుంటాం. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే.. ఎప్పుడు క్లైమాక్స్ కు వెళ్లిపోతామా అని ప్రారంభమైన కాసేపటికే అనిపిస్తుంది. అయితే లక్కీగా థియోటర్ ఎక్సపీరియన్స్ కాదు కాబట్టి... కర్సర్ ని ఈ చివరి నుంచి ఆ చివరకు లాగాలనిపిస్తుంది. అయితే మధ్యలో మాల్కోవా.. ఏమన్నా చూపించిందేమో అని ఆశపడితే మాత్రం నిరాశతప్పదు.

అయితే ఈ సినిమాకు ఉన్న ఒకే ఒక్క ప్లస్ ఏమిటీ అంటే... 52 నిమిషాల లెంగ్త్ మాత్రమే ఉండటం. ఫైనల్ గా ఇది సినిమా అంటే శాటిలైట్ సినిమాలు తీసే వాళ్లు కూడా ఆశ్చర్యపోతారు. తమకు వర్మ ఇలా పోటీకి వస్తారని ఊహించరు. ఇక టెక్నికల్ టీమ్ గురించి చెప్పుకోవటానికి ఏమీ లేదు. కథ అంతా ఎనభైల్లో వచ్చిన హాలీవుడ్ సీ గ్రేడ్ సినిమాల నుంచి ఎత్తిందే. మాటలు ఏవో ఇంగ్లీష్ లో వస్తుంటాయి. వాటి గురించి చెప్పుకునేదేమీ లేదు. ఈ సినిమాలో ఎండమావిలా ఆ ఎడారులను బాగా చూపించిన  అగస్త్య మంజు ఫొటోగ్రఫీ బాగుంది.

ఫైనల్ థాట్:
అదృష్టం ఏమిటంటే... థియోటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కాలేదు..లేకుంటే ఈ బోర్ ని భరించటం వర్మ వల్ల కూడా కాదు.

ఎవరెవరు
నటీనటులు : మియా మల్కోవా - రెనాన్ సేవరో
సంగీతం : రవి శంకర్
ఛాయాగ్రహణం : అగస్త్య మంజు
నిర్మాత :  ఏ కంపెనీ/ఆర్.యస్.ఆర్ ప్రొడక్షన్
రచన - దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ

 --- సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:1

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios