వ్యాపార వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండకపోతే నష్టాలు తప్పవు. ముఖ్యంగా రియల్‌ స్టేట్ వ్యవహారాల్లో ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా కోట్లు కోల్పోవాల్సి వస్తుంది. టాప్‌ హీరోయిన్లు నయనతార, రమ్యకృష్ణలకు ఇలాంటి అనుభవమే ఎదురైందన్న విషయం కోలీవుడ్‌ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఓ రియల్ ఎస్టేట్‌ కంపెనీ చేతిలో ఈ ఇద్దరు అందాల భామలు మోసపోయారట. అంతేకాదు సదరు సంస్థ చేతిలో లెజెండరీ క్రికెటర్‌ సచిన్ టెండూల్కర్‌ సతీమణి కూడా మోసపోయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు నిర్మించేందుకు భారీ ఎత్తున స్థలాలు సేకరించింది. ఆ స్థలాన్ని కోట్లు రూపాయలకు సెలబ్రిటీలకు విక్రయించారు. అయితే ఆ కంపెనీ సేకరించిన ఆ భూమి వ్యవసాయ భూమి అని, అక్కడ రియల్‌ ఎస్టేట్‌ కన్స్‌స్ట్రక్షన్స్‌కు అనుమతులు లభించవని తరువాత బయటపడిందట. కేవలం ఎకరం లక్ష రూపాయల చొప్పున వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కోట్ల రూపాయలకు ఆ భూమిని అమ్మింది.

ఇటీవల కంపెనీ భాగస్వాముల మధ్య వివాదాలు రావటంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు సదరు కంపెనీకి లీగల్‌ నోటీసులు కూడా పంపినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కంపెనీ చేతిలో నయనతార, రమ్యకృష్ణ సహా మరికొంత మంది మోసపోయినట్టుగా వార్తలు వినిపిస్తున్నా.. ఇంతవరకు ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. ఈ వ్యవహారంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.