ఓ తరం సినిమా ప్రియులకి, సినిమా వాళ్లకి అత్యంత ఇష్టమైన సినిమా పత్రిక విజయ చిత్ర.  ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు లాంటి పెద్దల ప్రోత్సాహంతో, ‘నాగిరెడ్డి - చక్రపాణి’ జంట దగ్గర ‘విజయచిత్ర’ సినీ మాసపత్రికలో చేరడం, ఆ సంస్థలో కొన్ని దశాబ్దాలు పనిచేయడం మరో తీపి జ్ఞాపకం అంటారు రావి కొండలరావు గారు. 

ఓ పత్రిక కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ..."1966 జూలైలో ‘విజయచిత్ర’ తొలి సంచిక వచ్చింది. ఆ సంచిక తీసుకొని ఇతర పెద్దలతో కలసి నేను, మా ఆవిడ తిరుమల వెంకన్న పాదాల దగ్గర పూజ చేయించుకు వచ్చిన సంగతులు ఇవాళ్టికీ గుర్తే! అప్పటి నుంచి 1992 వరకు ‘విజయచిత్ర’కు సహాయ సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహించాను. నేనేది చేయాలనుకున్నా, రాయాలనుకున్నా అభ్యంతరం చెప్పని యాజమాన్యం నాకు దక్కిన వరం. ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే, మరో పక్క ఉదయం షూటింగ్‌లకు వెళుతూనో, రాత్రి షూటింగ్‌లు అయ్యాకో ఆఫీసుకు వెళ్ళి, వ్యాసాలు రాసేవాణ్ణి. ప్రూఫ్‌లు చూసేవాణ్ణి అని గుర్తు చేసుకున్నారు ఓ ఇంటర్వూలో. 

అలాగే ..చిత్తూరు నాగయ్య గారు చితికిపోయాక, ఆయన ‘స్వీయచరిత్ర’ను ‘విజయచిత్ర’లో రాశా. లైమ్‌లైట్‌లో లేని నాగయ్య కథెందుకు, మా హీరోది వెయ్యమంటూ ఒక అగ్ర హీరో అభిమానులు దండెత్తారు. కానీ, జీవితంలో ఎన్నో ఒడుదొడుకులున్న నాగయ్య గారి కథే బాగుంటుందని చెబితే, అభిమానుల ఒత్తిడికి తలొగ్గకుండా మా ఎడిటర్ విశ్వనాథరెడ్డి గారు ఒప్పుకున్నారు. ఆ ‘స్వీయచరిత్ర’కు ఎంతో ఆదరణ లభించింది అన్నారు.