హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్లు తన పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మేసేజ్ లపై ప్రముఖ టాలీవుడ్ నటుడు రావు రమేష్ స్పందించారు. అసలు తనకు  సోషల్ మీడియా ఖాతాలే లేవని... అలాంటప్పుడు తానెలా ఈ ట్వీట్లు చేయగలనని అన్నారు. తన పేరుతో ఎవరో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఇదంతా చేస్తున్నారని... వీటిని ఎవరూ నమ్మవద్దని సూచించారు. 

రావు రమేష్ చేసినట్లుగా ప్రచారమవుతున్న ట్వీట్ ఇలా వుంది. ''మొదటి విధ్వంసం! చాలా బాధపడ్డా.. మన ఆంధ్రప్రదేశ్ ఎటు వెళ్తుందో అని. ఇప్పటికైనా మారతారని ఆశిస్తూ - మీ రావు రమేష్''  అంటూ వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నట్లుగా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

read more   KGF 2లో రావు రమేష్.. స్ట్రాంగ్ రోల్ పై సస్పెన్స్!

ఇది వివాదాస్పదమయ్యే అవకాశం వుండటంతో రావు రమేష్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తాను విమర్శించలేదని వివరణ ఇచ్చుకున్నారు. తనకు ట్విట్టర్లోనే కాదు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో కూడా అధికారిక ఖాతా  లేదని తెలిపారు. కాబట్టి సోషల్ మీడియాలో తన పేరుతో కనిపించే పోస్టులకు తనకెలాంటి సంబంధం లేదని తెలిపారు.  దయచేసి వాటిని నమ్మవద్దని రావు రమేష్ సూచించారు. 

తనను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే వదిలిపెట్టబోనని...తన పేరు మీద ఇలా చేస్తున్న వారి మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టబోతున్నట్లు రావు రమేష్ తెలిపారు. తాను ఏదయినా చెప్పాలనుకుంటే మీడియా ముందుకు వచ్చి చెబుతానని రావు రమేష్ తెలిపారు.