‘ఓహోహోహో.. ఏం వయ్యారం ఏం వయ్యారం. ఏ మాటకామాట సెప్పుకోవాలిగానండీ ఈ పిల్ల ఎదురొత్తుంటే మా ఊరుకే 18 సంవత్సరాల వయసొచ్చినట్టు ఉంటదండి. ఈ చిట్టిబాబు గుండెకాయని గోలెట్టించేసింది ఈ పిల్లేనండి. పేరు రామలక్ష్మండి. ఊరు రంగస్థలం’.. అంటూ రామలక్ష్మిని చిట్టిబాబు పరిచయం చేసేశాడు. ఈ మేరకు రామలక్ష్మిని పరిచయం చేసే ‘రంగస్థలం’ టీజర్‌ను సమంత తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు.
 

అచ్చతెలుగు పల్లెటూరి అమ్మాయిలా సమంత అద్భుతంగా ఉంది. నడుంపై బిందెతో వయ్యారంగా నడిచినా, మగాడిలా సైకిల్ తొక్కినా, అమ్మలక్కలతో కలసి చెరుకుగడలు నెత్తిన మోసినా.. సమంతకు సాటిలేరు ఎవరూ అనిపించేలా ఉంది రామలక్ష్మి పాత్ర. చిట్టిబాబును ఇప్పటికే ‘సౌండ్ ఇంజినీర్’గా చూపించి సినిమాపై అంచనాలు మరింత పెంచేశారు సుకుమార్. ఇప్పుడు ఈ రామలక్ష్మి పాత్రతో ఎక్కడా లేనంత క్రేజ్ ఏర్పడింది. మెగా అభిమానులకు మరో గిఫ్ట్ ఏంటంటే.. ఫిబ్రవరి 13న ‘రంగస్థలం’ తొలిపాట వచ్చేస్తో్ంది. ఈ మేరకు రామలక్ష్మి టీజర్ ద్వారా ఈ తేదీని ప్రకటించారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

 

ఈ సినిమాలో సమంత మూగ పాత్రలో నటిస్తోందంటూ మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చేలా టీజర్‌లో రామలక్ష్మి పాత్రకు అస్సలు డైలాగులే పెట్టలేదు. దీన్ని బట్టి చూస్తుంటే ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం నిజమేమో అనే అనుమానం కలుగుతోంది. 1985 కాలం నాటి గ్రామీణ నేపథ్యంలో ప్రేమకథా చిత్రంగా ‘రంగస్థలం’ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎరినేని, రవిశంకర్ ఎరినేని, మోహన్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.