అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎనౌన్సమెంట్ వచ్చేసింది.బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ తో క‌లిసి సందీప్ రెడ్డి వంగా త‌న మూడో చిత్రం చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. ఏనిమల్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి టీజర్ ని న్యూ ఇయిర్ శుభాకాంక్షలు తెలుపుతూ వదిలారు. ఈ టీజర్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. అయితే ఈ టీజర్ లో ఎక్కడా ఎవరూ కనిపించరు. కేవలం వాయిస్ లతోనే మేనేజ్ చేసారు. మీరూ ఇక్కడ ఆ టీజర్ వీడియోని చూడవచ్చు.

బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు గ్యాంగ్ స్టర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. కథ విన్న రణబీర్ కపూర్ సినిమా చేయడానికి అంగీకరించాడని చెప్తున్నారు.మొదట ఈ సినిమాకు టైటిల్ గా ‘డెవిల్’ అనే పేరును అనుకున్నాడట సందీప్ రెడ్డి. అయితే.. ఈ టైటిల్ ను సల్మాన్ ఖాన్ తో కిక్ 2 తీసేందుకు సాజిద్ నడియాద్ వాలా రిజిస్టర్ చేసుకున్నాడట. టైటిల్ ఇచ్చేందుకు సాజిద్ నిరాకరించడంతో ‘యానిమల్’ అనే పేరును ఖరారు చేసారు.  

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన ‘అర్జున్ రెడ్డి’ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. హిందీలో షాహిద్ కపూర్ తో ‘కబీర్ సింగ్’ పేరుతో అర్జున్ రెడ్డిని రీమేక్ చేశాడు. అక్కడ కూడా ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయింది. దీంతో సందీప రెడ్డి పేరు మరింత మోగిపోయింది. ఈ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి ఎవరితో సినిమా చేస్తాడో అనే వార్తలు హల్ చల్ చేసాయి.  అనేకమంది టాలీవుడ్ స్టార్ హీరోల పేర్లూ వినిపించాయి. ఏదీ వర్కవుట్ కాలేదు. ఇంతకాలానికి సందీప్ రెడ్డి మళ్లీ బాలీవుడ్ లోనే సినిమా చేయబోతున్నాడు.
 
టీ సీరిస్ కు చెందిన భూష‌ణ్ కుమార్, కృష‌న్ కుమార్, సందీప్, అత‌ని సోద‌రుడు ప్ర‌ణ‌య్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.  ఈ చిత్రంలో ప‌రిణితీచోప్రా హీరోయిన్ గా న‌టించ‌నుంది. అలాగే అనీల్ క‌పూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ర‌ణ్‌బీర్ క‌పూర్ ప్ర‌స్తుతం బ్ర‌హ్మాస్త్రా చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఈ సినిమా త‌ర్వాత సందీప్‌తో క‌లిసి ఈ ప్రాజెక్ట్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.