దర్శకుడు గుణశేఖర్ నిన్న నూతన సంవత్సరం సందర్భంగా ఓ మూవీ ప్రకటన చేశారు. స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం అనే చిత్రాన్ని ప్రకటించడం జరిగింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ భారీ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. శాకుంతల కాన్సెప్ట్ పోస్టర్ అండ్ వీడియో ఆకట్టుకోగా సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నామని ప్రకటించి, నయా ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. 

కాగా గుణశేఖర్, రానా దగ్గుబాటితో హిరణ్యకశ్యప అనే ఓ పౌరాణిక చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చి దాదాపు ఏడాది అవుతుంది. ఏడాది కాలంగా హిరణ్యకశ్యప పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. అక్టోబర్ నెలలో కోవిడ్  కఠిన పరిస్థితులలో కూడా హిరణ్యకశ్యప ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగించినట్లు గుణశేఖర్ వెల్లడించాడు. అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యాయని, రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు అనేది త్వరలో వెల్లడిస్తామని సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం జరిగింది.

హిరణ్యకశ్యప పోస్టుప్రొడక్షన్ పనులకే కోట్లు ఖర్చుబెట్టారని సమాచారం వస్తుండగా... గుణశేఖర్ మరో కొత్త ప్రాజెక్ట్ పై ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. హిరణ్య కశ్యప భారీ బడ్జెట్ మూవీ. ఈ ఏడాది సెట్స్ పైకి వెళ్లినా కానీ షూటింగ్ పూర్తి కావడానికి ఏడాదికి పైనే సమయం పడుతుంది. అలాగే సమంతతో నిన్న ప్రకటించిన శాకుంతలం మూవీ కూడా పాన్ ఇండియా చిత్రమని తెలుస్తుండగా.. హిరణ్యకశ్యప చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది. రానా హిరణ్యకశ్యప చిత్రం మరింత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో సమంతతో గుణశేఖర్ ఈ ప్రాజెక్ట్ ప్రకటించారా అనే అనుమానం కలుగుతుంది. శాకుంతలం, హిరణ్యకశ్యప చిత్రాలలో ఏది ముందు సెట్స్ పైకి వెళుతుందో అర్థం కావడం లేదు.  మరి ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం దొరకాలంటే గుణశేఖర్ నోరువిప్పాలసిందే.