వివాదాలు జోలికి అసలు పోడు హీరో రామ్. తనేంటో,తన సినిమాలేంటో అన్నట్లుంటాడు. సోషల్ మీడియాలో కూడా తన సినిమాల ప్రమోషన్ తప్పించి మిగతా విషయాలపై స్పందించటానికి పెద్దగా ఆసక్తి చూపించడు. తమ కుటుంబం సినీ నిర్మాణ రంగంలో ఉండటం, హీరోగా తనకున్న పరిచయాలు ఆయన్ని వివాదస్పద విషయాల్లోకి వేలు పెట్టనివ్వవు. వ్యక్తిగతంగా కూడా రామ్ చాలా సున్నితమైన మనస్తత్వం. ఇలాంటి రామ్ తాజాగా ఓ ట్వీట్ చేసారు. అదీ ప్రస్తుతం ఇండస్ట్రీలో బర్నింగ్ టాపిక్ గా మారిన ఓటీటీ ల గురించి. అది చూసిన వారు షాక్ అవుతున్నారు. ఆయన మనస్సులో ఉద్దేశ్యం ఏమిటి..ఈ ట్విట్ వేయటం వెనక అంతరార్దం ఏమిటి..దీనికి తన తాజా చిత్రం రెడ్ కు ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో సోషల్ మీడియా జనం ఇన్విస్టిగేట్ చేస్తూ బిజీగా ఉన్నారు. 

రామ్ హీరోగా నటించిన రెడ్ సినిమా థియోటర్స్ లో ఈపాటికి రిలీజ్ కావాల్సింది. కరోనా కారణంగా ఆగింది. అమేజాన్ ప్రైమ్ వారు నిర్మాత,రామ్ పెదనాన్న అయిన స్రవంతి రవికిషోర్ కు భారి మొత్తం ఆఫర్ చేసినా, రామ్ ఈ ఆలోచనకు ఓకే చెయ్యలేదు. ఈ క్రమంలో ఆయన నుంచి ఓ ట్వీట్ వచ్చింది. ఓటీటికు సినిమాలు ఇచ్చేస్తూన్న నేపధ్యంలో ఈ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన ఆ ట్వీట్ లో ఏం చెప్పారంటే సినిమా ఇండస్ట్రీ కొందరికి పేషన్. మరికొందరికి బిజినెస్..మిగిలిన వాళ్లకు గ్యాంబిలింగ్. ఎవరికి వారు తమ కోణం నుంచి చూస్తూంటారు అని అర్దం వచ్చేలా ట్వీట్ చేసారు. ఇది రెడ్ సినిమా గురించే అని కొందరంటున్నారు. అదేమి కాదని, క్యాజువల్ గా ఇప్పుడున్న ఇండస్ట్రీ పరిస్దితులను బయిటపెడుతూ చేసిన ట్వీట్ అని ఫ్యాన్స్ అంటున్నారు. 

రీసెంట్ గా పుట్టిన రోజు జరుపుకున్న ఇస్మార్ట్ అబ్బాయి రెడ్ రిలీజ్ పై స్పష్టతనిచ్చాడు.‘కొన్ని ఓటీటీ ప్లాట్​ఫామ్స్ నుంచి మంచి ధరలకు సినిమాను అమ్మాల్సిందిగా మాకు ఆఫర్స్ వచ్చాయి. అయితే మేం వారి ఆఫర్లను తిరస్కరించాం. ఫ్యాన్స్ కు పర్ఫెక్ట్ వాచింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. సీటులో ఉత్కంఠగా కూర్చోబెట్టే సినిమా రెడ్. ఉత్సుకత కలిగించే ఇన్వెస్టిగేషన్స్ నేపథ్యంలో మాస్ అంశాల మిళితంగా ఈ మూవీని తెరకెక్కించాం. ఈ మూవీని పెద్ద స్క్రీన్స్ లోనే చూడాలి. అందుకోసమే తీశాం కూడా. పరిస్థితులు అదుపులోకి వచ్చే దాకా ఎదురుచూస్తాం. అప్పుడే సినిమాను విడుదల చేస్తాం’ అని ఓ ఇంటర్వ్యూలో రామ్ క్లారిటీ ఇచ్చాడు. 
   
కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా పేతురేజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్‌లు హీరోయిన్లుగా నటించారు. స్రవంతి మూవీస్‌ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్‌.. క్లాస్‌, మాస్‌ లుక్స్‌లో అదరగొట్టినట్టుగా తెలుస్తోంది. ఇస్మార్ట్‌ శంకర్‌తో సత్తా చాటిన రామ్‌.. ఈ చిత్రంతో మరో సక్సెస్ ని  తన ఖాతాలో వేసుకుంటాడని అభిమానులు అంటున్నారు.