కథేంటి

రెస్ఠారెంట్ ఓనర్ అయిన కె. ఆనంద్ రావు(శ్రీకాంత్ అయ్యంగర్)కు కరోనా కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది.  కరోనా లాక్ డౌన్ విధించినప్పటి నుంచి బయట ఉన్న పరిస్థితులను, టీవీల్లో వస్తున్న వార్తల్ని చూస్తూ, ఒకదానికొకటి సంభందం  లేకుండా ప్రభుత్వాలు ఇస్తున్న స్టేట్మెంట్స్ తో, వాట్సాప్ లో వస్తున్న అర్దపద్దం లేని మెసేజెస్..తో ఉక్కిరిబిక్కిరై మానసికంగా కంగారు పడుతూంటాడు.  ఎక్కడ కరోనా తన ఇంటిని టచ్ చేస్తుందో అని,మరో ప్రక్క హాస్పటిల్ బిల్ లను తలుచుకుని  లోలోపల ప్రతిక్షణం భయపడుతూంటాడు. ఇంట్లో ఇద్దరు కొడుకులు, కోడలు,కూతరు,భార్య అందరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్నట్లుగా ఎవరికి వాళ్లు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటూంటారు. అయితే ఈ లోగా ఊహించని విధంగా కుమార్తె శాంతి (సోనియా ఆకుల) లో కరోనా లక్షణాలు కనపడటం మొదలవుతాయి. ఆ పరిస్దితుల్లో ఆనందరావు ఏం చేసాడు. కరోనా ఆ ఇంటిని కబలించిందా..వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 
ఎలా ఉందంటే...

పైన చెప్పిన కథ అంతా మీరు ట్రైలర్ లో చూసే ఉంటారు. అందులో కొత్తగా మాట్లాడుకోవటానికి గానీ, చెప్పుకోవటానికి గానీ ఏమీ లేదు. కరోనా వల్ల మిడిల్ క్లాస్ ఎలా ఇబ్బంది పడింది అనే విషయాలు చూపిద్దామనే సదుద్దేశ్యంతో మొదలెట్టినా, లేదా కరోనాని కూడా క్యాష్ చేసుకుందామనే ఆలోచనతో సినిమా తీసినా ..ఎలా చేసినా ఆ ఉద్దేశ్యం అయితే నెరవేరలేదనే చెప్పాలి. ఒకే ఇంట్లో హడావిడిగా చుట్టేసినట్లు అనిపిస్తున్న ఈ సినిమాలో చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాంప్లిక్ట్ కనీకపనట్లు ఉంటుంది. నిజానికి ఇది కరోనా దేశ వ్యాప్తంగా రైజింగ్ లో ఉన్నప్పుడు రిలీజైతే ఖచ్చితంగా ఆ హారర్ మూవ్ మెంట్స్ ని ప్రేక్షకులు ఫీల్ అవుదురు. కానీ మెల్లిమెల్లిగా జనాల్లో భయం పోయింది. మాస్క్ పెట్టుకోవటానికి కూడా జనం ఇష్టత చూపటం లేదు.డెత్ రేటు కూడా తగ్గింది. ఇటువంటి పరిస్దితుల్లో కరోనాను పెద్దగా జనం కేర్ చేయిని స్దితిలో ..కరోనాను చూసి భయపడే వ్యక్తిని చూస్తే జాలి వేస్తుంది తప్ప..అతనితో ఐడింటిఫై అయ్యే సిట్యువేషన్ అయితే కనపడదు. అలాగే ఎవరు ఇళ్లలో సోషల్ డిస్టెన్స్ పాటించరు..పాటించలేదు..(బయిటే పాటించటం లేదు). లాక్ డౌన్ విధించిన కొత్తలో కరోనా గురించి పెద్దగా అవగాహన లేనప్పుడు ఎక్కడో కొద్దిమందిలో ఆ స్దాయి భయం నెలకొందేమో. వాళ్లు కూడా ఇప్పుడు అప్పటి తమ సిట్యువేషన్స్ ని తలుచుకుని నిట్టూర్చటమో లేక నవ్వుకోవటమో చేస్తూంటారు. ఇలాంటి రాంగ్ టైమ్ లో ఈ సినిమా రావటం ..సినిమాలో డ్రామా కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవటం..పరమ బోర్ కొట్టించింది. ఓ పదినిముషాలు షార్ట్ ఫిల్మ్ గా పనికొచ్చే కంటెంట్ ని సినిమాగా తీసి ఇబ్బందిపెట్టారు. అలాగే సినిమాలో సీన్స్ రిపీటివ్ గా ఉండి విసుగెత్తించాయి.

ఎవరెలా చేసారు..

శ్రీకాంత్ అయ్యంగారు అద్బుతమైన టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ ..అందులో తిరుగులేదు. ఇంత చెత్తగా అనిపించే సినిమాలోనూ తనదైన ప్రతిభను ప్రకాశింప చేసారు. చాలా నమ్మశక్యంగా,న్యాచురల్ గా సీన్స్ ని పండించారు. వంశీ చాగంటి, సోనియా..తమ పాత్రలను బాగానే పోషించారు. అయితే దర్శకత్వం బాగా నాశిరకంగా ఉంది. చుట్టేసినట్లు తెలిసిపోతోంది. మిగతా డిపార్టమెంట్స్ కూడా ఏదో చేసామంటే చేసాము అన్నట్లుగా ఉన్నాయి. ఏదీ చెప్పుకునేంత గొప్ప ఫెరఫార్మ్ చేయలేకపోయాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా ఏమీ లేవు. ఖర్చు కూడా ఏమీ అయినట్లు లేదు. 

ఫైనల్ థాట్
దొంగలు పడ్డ ఆర్నెలకు కుక్కలు మొరిగినట్లు...,కరోనా హంగామా ముగిసాక...సినిమా విడుదలైంది

Rating‍: 1/5

ఎవరెవరు..

బ్యానర్‍: కంపెనీ, సిఎం క్రియేషన్స్
తారాగణం: శ్రీకాంత్‍ అయ్యంగార్‍, వంశీ చాగంటి, సోనియా ఆకుల, కల్పలత గార్లపాటి, దక్షి గుత్తికొండ, దొర సాయితేజ తదితరులు
రచన: కళ్యాణ్‍ రాఘవ్‍ పసుపుల
సంగీతం: డి.ఎస్‍.ఆర్‍
కూర్పు: నాగేంద్ర
ఛాయాగ్రహణం: వి. మల్హభట్‍ జోషి
రన్ టైమ్: 1 గంట 24 నిముషాలు
నిర్మాతలు: రామ్‍ గోపాల్‍ వర్మ, నన్నపురెడ్డి, ఎల్లారెడ్డి
దర్శకత్వం: అగస్త్య మంజు
విడుదల తేదీ: డిసెంబరు 11, 2020