ఫొటో చూసి పులిహార కలిపేయటం మనవాళ్లకు బాగా అలవాటైంది. తమ క్రియేటివిటీని జోడించి క్షణాల్లో వండి వడ్డించేస్తూంటారు. ముఖ్యంగా రామ్ చరణ్ వంటి స్టార్ సీన్ లో ఉంటే ఇంక చెప్పేదేముంది. వ్యూస్ కోసం న్యూస్ లు రెడీ అయ్యిపోతాయి. అలాంటిదే ఓ వార్త ఇప్పుడు వెబ్ మీడియా నుంచి  సోషల్ మీడియాకు వెళ్లి అక్కడ హల్ చల్ చేస్తోంది. ఆ వార్త మరేదో కాదు మంచు మనోజ్, రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ మల్టి స్టారర్ చిత్రం రూపొందనుందని. రామ్ చరణ్ మల్టిస్టారర్ చేయదలచుకుంటే ఎన్టీఆర్ తో చేస్తాడు లేదా మహేష్ తో చేస్తాడు కానీ పోయి పోయి ...మంచు మనోజ్ తో ఎందుకు చేస్తాడనేది కీలకమైన ప్రశ్న. అసలు ఈ వార్త లాంటి రూమర్ ఎలా పుట్టింది అంటే..

రీసెంట్‌గా మంచు మనోజ్ హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న ‘అహం బ్రహ్మాస్మి’ సినిమా ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా రామ్ చరణ్ విచ్చేసి క్లాప్ కొట్టాడు. మంచు మ‌నోజ్ స్వ‌ీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో రూపొందనున్న ఈ మూవీ ఇటీవ‌ల‌ హైద‌రాబాద్ లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. 

మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ సిల్వర్‍ స్క్రీన్‍పై తన  ఎంట్రీ ఇస్తున్నాడు మంచు మనోజ్. దీంతో ఈ చిత్రంపై ఎక్సపెక్టేషన్స్ పెంచటానికి రంగం సిద్దం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మంచు మనోజ్ ఇద్దరూ కలిసి ఓ మల్టీ స్టారర్‌ చిత్రంలో నటించబోతున్నారట అంటూ ఓ వార్త మొదలైంది. అది కూడా ఓ ఓల్డ్  హిట్‌ సినిమా రీమేక్ అన్నారు. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కబోతుందని కొసమెరపు ఇచ్చారు. ఇంతకీ ఆ ఓల్డ్ హిట్ ఏమిటీ అంటే..

అప్పట్లో చిరంజీవి, మోహన్ బాబు హీరోలుగా నటించిన ‘బిల్లా రంగా’ సినిమాను రీమేక్ చేస్తారట. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు రీమేక్ చేయాలనున్నట్టు చెప్తున్నారు. బిల్లా రంగాలో.. చిరు, మోహన్‌ బాబులు ద్విపాత్రాభినయం చేశారు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది.  యాక్షన్‌ చిత్రాల్లో కొత్త ఒరవడి సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రంలో.. చరణ్, మనోజ్‌లు వాళ్ల తండ్రుల చేసిన పాత్రలో నటించబోతున్నట్టు ప్ర‌చారం చేస్తున్నారు. ఇది వింటూంటే క్లియర్ గా తెలిసిపోవటం లేదూ..ఇదో పులిహార వార్త అని.