నేటి నుంచి మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడిగించిచన సంగతి తెలిసిందే. దాంతో టాలీవుడ్ మరోసారి తన యాక్షన్ ప్లాన్ ని మార్చుకోవాల్సి వచ్చింది. ఇందులో భాగంగా దర్శకుడు రాజమౌళి మాత్రం  లాక్ డౌన్ అమలులో ఉండగానే  ఆర్ ఆర్ ఆర్ డబ్బింగ్ పనులు మొదలు పెట్టినట్లు సమాచారం. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ఇప్పటికే డబ్బై శాతానికి పైగా పూర్తయింది. షూటింగ్ దశలోనే విదేశాల్లో  గ్రాఫిక్స్ పనులు కూడా చేసారు. ఏదైమైనా షూటింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు జరిగినప్పటికీ.. ముందుగా అనుకున్నట్లే వచ్చే ఏడాది జనవరి 8న సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర టీమ్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ లాక్‌డౌన్‌ సమయంలోనే వీలైనంత వరకు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో చిత్ర టీమ్  అంతా ఇంట్లోనే ఉంటూ సినిమా పనులు చేస్తున్నట్లు టాక్‌. ఇందులో భాగంగానే  హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ఇంటి నుంచే డబ్బింగ్‌ పనుల్ని మొదలుపెట్టారట.

మీడియాలో ప్రచారం జరుగుతున్న దాని ప్రకారం ఇందు కోసం రాజమౌళి.. తారక్‌, చరణ్‌ ఇంటికి రెండు క్వాలిటీ మైక్‌లు పంపినట్లు సమాచారం. వారి వారి ఇంటిలో సౌండ్‌ ఫ్రూఫ్‌ గోడలు ఉండే మినీ థియేటర్‌లో డబ్బింగ్‌ చెబుతున్నట్లు తెలిసింది. మరి ఈ  మ్యాటర్ లో  ఎంత మాత్రం నిజం ఉందో తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమాకు సంభందించి అలియా భట్‌ షెడ్యూల్‌ ప్రారంభం కావాల్సి ఉంది. నటి ఒలీవియా మోరిస్‌ ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొన్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో కొమరం భీమ్‌గా తారక్‌, అల్లూరి సీతారామరాజుగా చరణ్‌ కనిపించనున్నారు.