సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ మృతి వ్యవహారం బాలీవుడ్ ను టాలీవుడ్ వరకు పాకింది. ఇప్పటికే ఈ కేసులో చాలా మంది ప్రముఖులు పేర్లు రావటం పలువురు అరెస్ట్ కూడా కావటంతో మిగత వారిలో కలవరం మొదలైంది. ముఖ్యంగా హీరోయిన్లు రకుల్‌ ప్రీత్‌ సింగ్, సారా అలీ ఖాన్‌ల పేర్లు ఈ కేసు విషయంలో  ప్రధానంగా వినిపిస్తుండటంతో మీడియా కూడా ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తోంది.

ఈ నేపథ్యంలో నటి రకుల్ ప్రీత్‌ సింగ్ ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. మీడియాలో రియా డ్రగ్స్‌ కేసులో తన పేరును పదే పదే ప్రస్థావిస్తున్నారు. ఈ విషయంలో మీడియాను కట్టడి చేయాలంటూ కోర్టును కోరింది. ఈ విషయంపై స్పందించిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రకుల్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని త్వరగా ఓ నిర్ణయం తీసుకొవాలని ప్రసార భారతి, ప్రెస్ కౌన్సిల్‌కు ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాదు మీడియాపై కూడా కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్ట్. రియా కేసులో రకుల్ ప్రీత్ సింగ్‌ పేరును ప్రస్థావించే విషయంలో మీడియా కూడా సంయమనం పాటిస్తుందని ఆశిస్తున్నట్టుగా కోర్టు వ్యాఖ్యనించింది. ఇప్పటికే డ్రగ్స్ విషయంలో రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్‌తో పాటు మరో 5గురిని అదుపులోకి తీసుకుంది ఎన్సీబీ. ఈ నేపథ్యంలో రియా బాలీవుడ్ కు చెందిన 25 మంది ప్రముఖుల పేర్లు వెల్లడించినట్టుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది.