మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటిస్తున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి ఈ చిత్రాన్ని 1920 బ్రిటిష్ కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రలో నటిస్తున్నారు. 

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా రాజమౌళి షూటింగ్ లొకేషన్ లో ఎన్టీఆర్ తో కలసి ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానుల్లో వైరల్ గా మారింది. రాజమౌళి దర్శకత్వం వహించిన తొలి చిత్రం స్టూడెంట్ నెం1. ఆ చిత్రంలో ఎన్టీఆర్ హీరో. ఆ సమయంలో ఎన్టీఆర్ కు సన్నివేశం వివరిస్తున్న ఫోటో.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లొకేషన్ లో సన్నివేశం వివరిస్తున్న ఫోటోని రాజమౌళి సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

18 ఏళ్ల క్రితం ఇదే రోజున స్టూడెంట్ నెం 1 చిత్రం విడుదలయింది. ఆ సమయంలో ఎన్టీఆర్ లావుగా ఉన్నాడు. నేను లావుగా ఉన్నా. ఇన్నేళ్ల తర్వాత నేను కాస్త లావయ్యా.. ఎన్టీఆర్ సన్నబడ్డాడు.. ఈ రెండు దృశ్యాలు రామోజీ ఫిలిం సిటీలోనివే అని రాజమౌళి తెలిపారు. రాజమౌళి షేర్ చేసిన ఈ ఫోటోలు ఎన్టీఆర్ అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ కు హీరోయిన్ గా అలియా భట్ నటిస్తోంది. అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డివివి దానయ్య దాదాపు 350 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.