కరోనా కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఎక్కడి షూటింగ్‌లు అక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ లిస్ట్ లో రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం  'ఆర్‌ఆర్‌ఆర్‌: రౌద్రం రుధిరం రణం' కూడా ఒకటి. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరో గా ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రమిది.  లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు రెండు నెలల కీలక సమయం ఇప్పటికే వేస్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' విషయంలో రాజమౌళి ఒక నిర్ణయానికి వచ్చారని మీడియాలో ప్రచారం మొదలైంది. చిత్ర టీమ్ తో చర్చించి కథలో కొద్దిపాటి మార్పులు చేయబోతున్నట్లు సమాచారం.అందుకు కారణం  అనుకున్న సమయానికి సినిమా విడుదల చేయాలని జక్కన్న దృఢ నిశ్చయంతో ఉండటమే అంటున్నారు. అయితే అందుతున్న సమాచారం మేరకు ..కథలో మార్పులు ఏమీ ఉండవని తెలుస్తోంది. మొదట లాక్ చేసిన స్క్రిప్టు మేరకే ముందుకు వెళ్తారట. అయితే  భారీ యాక్షన్‌ సీక్వెన్స్, అవుట్‌ డోర్‌ షెడ్యూల్‌ సీన్స్‌ విషయంలో భారీతనం తగ్గింపు దిసగా మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పుడున్న పరిస్దితులను అనుసరించి ..వీలైనంత వరకు తక్కువ మందితో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే వేగంగా షూటింగ్ పూర్తి చేసుకునేలా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జక్కన్న రెగ్యులర్ స్టైల్ అయిన రీషూట్ లు ఉండకుండా ఫెరఫెక్ట్ ప్లానింగ్ తోవెళ్తారట.  ఎలాగూ ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తయింది కాబట్టి.. ఇప్పుడు చేసే మార్పులు కథపై పెద్దగా ప్రభావం చూపవని భావిస్తున్నట్లు చెప్తున్నారు. అలాగే ఎప్పుడూ ఏ దర్శకుడు కూడా యాజటీజ్ స్క్రిప్టులో రాసుకున్నట్లుగా చేయరని, లొకేషన్, షూటింగ్ నాటి పరిస్దితులను బట్టి మార్పులు చేస్తారని, అలాంటి సమయంలో వచ్చే ఇంప్రవైజేషన్స్ అద్బుతంగా కుదురుతాయని అంటున్నారు. 
 
ఇక మొదట అనుకున్న ప్లాన్ ప్రకారం అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కావాల్సింది.  కానీ కరోనా దెబ్బ కొట్టింది . దాంతో  తాజాగా సంక్రాంతికి కూడా ఆర్ ఆర్ ఆర్ వచ్చేది కష్టమే అని నిర్మాత దానయ్య క్లారిటీ ఇచ్చారు. 30శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటి పరిస్థితులలో పూర్తి చేయడం చాలా కష్టం అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీనితో మరో నాలుగు నెలలు ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదాపడనుంది అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే చరణ్ పుట్టినరోజు కానుకగా చరణ్ ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేయగా అద్భుత రెస్పాన్స్ దక్కించుకుంది.