నటి రాగిణి ద్వివేది మరో వివాదంలో ఇరుక్కుంది. ఆమెను క్రితం వారం బెంగుళూరుకు చెందిన సీసిబీ పోలీస్ లు డ్రగ్ స్కాండిల్ లో అరెస్ట్ చేసారు. టెస్టింగ్ నిమిత్తం వీరిని బెంగళూరులోని కేపీ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, డోప్ టెస్ట్ కోసం ఇచ్చిన యూరిన్ శాంపిల్ విషయంలో రాగిణి చీటింగ్ చేసినట్టు తెలుస్తోంది. తన యూరిన్ లో కొంత నీటిని ఆమె మిక్స్ చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. శాంపిల్ లో వాటర్ మిక్స్ అయినట్టు వైద్యులు గుర్తించారట. దీంతో, మరోసారి ఆమె వద్ద నుంచి శాంపిల్ తీసుకుని పంపినట్టు సమాచారం.

మరో ప్రక్క సీసీబీ అధికారులు ఎన్ని ప్రశ్నలు వేసినా, ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రాగిణి ద్వివేది చెబుతున్న సమాధానం ఒకే ఒక్కటి. 'నాకేమీ తెలియదు' అని ఏమడిగినా ఒకటే సమాధానం వస్తుండటంతో, విసుగు చెందిన అధికారులు, ఆమె రిమాండ్ ను మరో పది రోజులు పొడిగించాలని కోర్టును కోరగా, న్యాయమూర్తి, ఐదు రోజుల పాటు ప్రశ్నించేందుకు అనుమతించారు.

మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా ఆరోపణలు రాగిణిపై రాగా, ఆమెను బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె దర్యాఫ్తు అధికారులకు ఏ మాత్రమూ సహకరించలేదని కోర్టుకు సీసీబీ తరఫు న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో రాగిణి తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది జీవీ కల్యాణ్ కుమార్, తన క్లయింట్ ఇంట్లో డ్రగ్స్ దొరకలేదని గుర్తు చేశారు.

తాను చెయ్యని నేరాన్ని ఆమె ఎలా అంగీకరించాలని ప్రశ్నించిన లాయర్, అధికారులు కోరుకుంటున్న కోణంలోనే సమాధానాలు ఇవ్వాలంటే ఎలాగంటూ వాదించారు. అన్ని ప్రశ్నలకూ తన క్లయింట్ సమాధానాలు ఇచ్చారని, ఆమెకు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో ఓ సీల్డ్ కవర్ ను న్యాయమూర్తికి అందించిన సీసీబీ, డ్రగ్స్ సరఫరాదారులతో రాగిణి స్వయంగా మాట్లాడారని, ఆమె మాదక ద్రవ్యాలను తెప్పించినట్టు, అందుకు సంబంధించిన సాక్ష్యాలను తొలగించినట్టు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది.

దీంతో ఆమె కస్టడీని మరో ఐదు రోజులు పొడిగిస్తున్నట్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఆపై తన క్లయింట్ కు వెన్ను నొప్పితో పాటు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని జీవీ కల్యాణ్ కుమార్ వ్యాఖ్యానించగా, ఆమెకు వైద్యులతో చికిత్స చేయిస్తామని సీసీబీ అధికారులు తెలిపారు. వైద్యులు సిఫార్సు చేస్తే, అందుకు అనుగుణంగా చికిత్సను కొనసాగిస్తామని కోర్టుకు స్పష్టం చేశారు.