Asianet News Telugu

అలా అయితే థియేటర్లు నడపడం కష్టం.. షూటింగ్‌లో నలుగురు చనిపోయారుః సురేష్‌బాబు

తెలంగాణాతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఆంధ్రాలో ప్రభుత్వం నిర్దేశించిన టికెట్‌ రేట్లకు సినిమా హాళ్లు నడపడం సాధ్యం కాదన్నారు నిర్మాత సురేష్‌బాబు.

producer suresh babu shocking comments on ticket rates and four members death arj
Author
Hyderabad, First Published Jul 18, 2021, 8:34 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల టికెట్‌ రేట్ల విషయంలో నిర్మాత సురేష్‌బాబు అసహనం వ్యక్తం చేశారు. ఇంతటి టికెట్‌ రేట్లతో థియేటర్లు నడపడం కష్టమన్నారు. థియేటర్‌ హౌజ్‌ఫుల్‌ అయినా కనీసం కరెంట్‌ బిల్లు కూడా రాదన్నారు. దీంతో ఏపీలో థియేటర్లు నడపడం ఎగ్జిబిటర్లకి జీవన్మరణ సమస్యగా మారిందన్నారు. వెంకటేష్‌ నటించిన `నారప్ప` చిత్రం ఈ నెల 20న ఓటీటీ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన మీడియాతో ముచ్చటించారు. 

 తెలంగాణాతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఆంధ్రాలో ప్రభుత్వం నిర్దేశించిన టికెట్‌ రేట్లకు సినిమా హాళ్లు నడపడం సాధ్యం కాదన్నారు. `టికెట్‌ ధరల్లో చిన్న సవరణలు అడిగినా ఏపీ ప్రభుత్వం చేయడం లేదు.  సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్స్‌ యాజమాన్యాలు సినిమా మీద ప్రేమతో నడపడమే తప్ప పైసా లాభం ఉండదు. రూ. 40 టిక్కెట్‌తో ఏసీ థియేటర్లు నడపమంటే హౌస్‌ఫుల్‌ అయినా కూడా కరెంట్‌ బిల్లు రాదు. ప్రభుత్వాన్ని అడిగితే మీరు థియేటర్లు తెరవండి తర్వాత మారుస్తాం అంటున్నారట` అని చెప్పారు.

`ఓటీటీలో సినిమా విడుదలపై ఆయన స్పందిస్తూ, సల్మాన్‌ ఖాన్‌ లాంటి స్టార్‌ హీరోలే ఓటీటీ బాట పడుతున్నారు. ప్రపంచంలో అది పెద్ద సంస్థగా పేరొందిన డిస్నీ సంస్థ థియేటర్‌లతోపాటు ఓటీటీలోనూ చిత్రాలను విడుదల చేస్తోంది. పరిస్థితులను బట్టి ప్రేక్షకుల అభిరుచి మారిందని ఆ సంస్థ గ్రహించింది. కొవిడ్‌ రాకపోయి ఉంటే ఓటీటీ ఇంత పాపులర్‌ అయ్యేది కాదు. కానీ కరోనా పరిస్థితుల్లో ఓటీటీ సినిమా ఇండస్ట్రీని కాపాడింది. ఓటీటీని ఆపడం అనేది భ్రమే.

 వెబ్‌సిరీస్‌ల సంఖ్య పెరగడం వల్ల సినీ కార్మికులకు పలు విభాగాల్లో ఉపాధి లభిస్తోంది.  దీనివల్ల ఎక్కువ నష్టపోయేది ఎగ్జిబిటర్లే. నిర్మాతలకు పెద్దగా నష్టమేమీ లేదు. కరోనా వల్ల గడిచిన 15 నెలల్లో 12 నెలలు థియేటర్లు మూసి ఉన్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. ఆస్తి పన్ను, మినిమం పవర్‌ చార్జీల్లో కూడా రాయితీ ఇవ్వడం లేదు. 15 నెలలుగా వాడని విద్యుత్‌కు బిల్లు చెల్లించాల్సి వస్తోంది. ఓటీటీ వల్ల థియేటర్‌ వ్యవస్థలో కాస్త మార్పు వస్తుందేమో కానీ కనుమరుగయ్యే అవకాశం లేద`న్నారు. 

`కరోనా కారణంగా భయం, భయంగానే  `నారప్ప` షూటింగ్‌ చేశాం. మొదట తమిళనాడు షూటింగ్ చేస్తున్న సమయంలో 6 కిలో మీటర్ల దూరంలో రెండు పాజిటివ్ కేసులు నమోదైనట్లు న్యూస్ రాగానే భయంతో అక్కడి నుంచి షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని పారిపోయాం. కానీ సెకండ్‌ వేవ్‌లో వేల సంఖ్యలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వచ్చినా పెద్దగా కంగారు పడలేదు. `నారప్ప` షూటింగ్‌ టైమ్‌లో ఈ సినిమాకు సంబంధించిన నలుగురు చనిపోయారు. జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రాణాలు పొగొట్టుకోవాల్సి వస్తుంది` అని తెలిపారు సురేష్‌బాబు. 

`సురేష్‌ ప్రొడక్షన్స్‌ త్వరలో సొంత ఓటీటీని ప్రారంభిస్తుంది. ఇప్పటికే కంటెంట్‌ క్రియేట్‌ చేయడం ప్రారంభించాం. అలాగే `ఎస్‌ పీ మ్యూజిక్స్‌` ప్రారంభిస్తున్నాం. `నారప్ప`లో రెండు పాటలను దీని ద్వారానే విడుదల చేస్తున్నాం. భవిష్యత్తులో నాన్‌ఫిల్మ్‌ మ్యూజిక్‌ ద్వారా వర్దమాన గాయనీగాయకులు, మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ను ప్రోత్సహిస్తాం. 

వైజాగ్‌లో రామానాయుడు స్టూడియోస్‌ నా స్వార్జితం. ప్రభుత్వం ఇచ్చిన భూమి కాదు. మార్కెట్‌ ధరకన్నా ఎక్కువ చెల్లించి కొన్నాను. భవిష్యత్‌లోనూ అక్కడ స్టూడియో నడుపుతాం. అయితే ప్రజా ప్రయోజనం కోసం ప్రభుత్వం ఏ భూమినైనా సేకరించవచ్చు. కానీ దానికి తగిన పరిహారం చెల్లించాలి` అని అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios