సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. అసలే కరోనా అన్ని కార్యక్రమాలు స్థంబించిపోయిన ఇండస్ట్రీ వర్గాలు ఇబ్బంది పడుతుంటే వరుసగా లెజెండరీ సెలబ్రిటీలు మరణిస్తుండటం ఇండస్ట్రీ వర్గాలను కలవరపెడుతోంది. ఉత్తరాది, దక్షిణాది అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో విషాదాలు కొనసాగుతున్నాయి. సీనియర్ నటులు, దర్శకులు, నిర్మాతల మరణాలు కలవరపెడుతున్నాయి.

ప్రముఖ నిర్మాత కందేపి సత్యనారాయణ ఆదివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటున్న ఆయన తీవ్ర అనారోగ్యానికి గురికావటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 9 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు.

సత్యనారాయణ మృతి పట్ల పలువురు తెలుగు, తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. పాండురంగ మహాత్మ్యం అనే డబ్బింగ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు సత్యనారాయణ. అనంతరం కొంగుముడి, దొరగారింట్లో దొంగోడు, శ్రీవారు వంటి తెలుగు సినిమాలతో పాటు తమిళంలో కూడా ఆయన పలు చిత్రాలను నిర్మించారు. మొత్తంగా 40 చిత్రాల‌కు పైగా నిర్మించిన ఆయన కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.