పవన్ భక్తుడు బండ్ల గణేష్ నేడు ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ తో మూవీ చేస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ''మా బాస్ మూవీకి ఒకే చెప్పారు,  మరోమారు నాకల నిజమైంది. కృతజ్ఞతలు దేవుడా'' అని బండ్ల గణేష్ ట్వీట్ చేయడంతో పాటు రీసెంట్ గా పవన్ తో కలిసి దిగిన ఫోటో పోస్ట్ చేశారు.  పవన్ నిర్మాత బండ్ల గణేష్ తో మూవీ చేయనున్నాడనే విషయంపై స్పష్టత వచ్చింది. బండ్ల గణేష్ నిర్మాతగా పవన్ రెండు చిత్రాలు చేశారు. మొదటగా వీరిద్దరూ కలిసి చేసిన తీన్ మార్ మూవీ పరాజయం పాలైంది. 

ఐతే 2012లో వీరిద్దరూ రెండవ సారి గబ్బర్ సింగ్ కోసం జతకట్టారు. హిందీ హిట్ మూవీ దబంగ్ కి తెలుగు రీమేక్ గా వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్న పవన్ కి భారీ ఉపశమనం కలిగించిన చిత్రం గబ్బర్ సింగ్ . ఆ మూవీ విడుదలై 8ఏళ్ళు దాటిపోతుంది. బండ్ల గణేష్ ఎప్పటి నుండో మరో చిత్రం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కుదరలేదు. 

తాజా ప్రకటనతో పవన్ తో బండ్ల గణేష్ మూవీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నాలుగు ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నారు. వకీల్ సాబ్ మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉండగా, దర్శకుడు క్రిష్ తో చేస్తున్న మూవీ షూటింగ్ మొదలైంది. హరీష్ శంకర్, సురేంధర్ రెడ్డితో చేస్తున్న చిత్రాలు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. బండ్ల గణేష్ మరో ప్రాజెక్ట్ ప్రకటించగా మొత్తంగా పవన్ నుండి రానున్న రెండు మూడేళ్ళలో 5 సినిమాలు రానున్నాయి.