గ్లోబర్ స్టార్, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఉక్రెయిన్ - రష్యా వార్ లో శరణార్థులైన వారికి మద్దతుగా నిలిచారు. వారిని అవసరమైన ఆర్థిక సాయంతో ఆదుకోవాలని ప్రపంచ నాయకులను కోరుతూ తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేసింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russian-Ukraine War) కారణంగా నిర్వాసితులైన శరణార్థులను ఆదుకోవాలని సినీ నటి ప్రియాంక చోప్రా తాజాగా ప్రపంచ నేతలను కోరారు. UNICEF గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్న ప్రియాంక చోప్రా అక్కడి పరిస్థితులపై తాజాగా స్పందించింది. ఈ సందర్భంగా ఆమె చాలా భావోద్వేగంగా మాట్లాడారు. శరణార్థులను తప్పకుండా ఆదుకోవాలని, ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించింది. ప్రపంచంలోని నేతలు, యాక్టివిస్టులు ముందుకు రావాలని కోరింది. ఇదే విషయాన్ని వివరిస్తూ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఓ వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
వీడియోలో చోప్రా మాట్లాడుతూ.. ‘ప్రపంచ నాయకులారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థులకు ఇప్పుడు మీ మద్దతు కావాలి. వారికి మీరంతా అండగా నిలవాలి" అని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పిల్లల స్థానభ్రంశంలో ఈ క్రైసిస్ అత్యంత వేగంగా ఉందన్నారు. ఆ చిన్నారులను చేరదీయకపోతే వారు ఎప్పటికీ ఒకేలా ఉండరని, వారూ మరేదైనా మార్గాల్లో వెళ్తారంటూ’ ప్రియాంక వీడియోలో పేర్కొంది.
అలాగే, ప్రపంచ నాయకులు శరణార్థులకు అండగా నిలిచేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని విరాళంగా ఇవ్వాలని కోరింది. ముఖ్యంగా ఉక్రెయిన్ (Ukraine)లో పిల్లలకు సహాయం చేయాలని విన్నవించింది. ఈ మేరకు విరాళాల సేకరణకు ప్రియాంక తన ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ బయోలో యునిసెఫ్ విరాళం లింక్‌ను జత చేసింది. ఈ లింక్ ను ప్రతి ఒక్కరూ షేర్ చేయాలని, శరణార్థులను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరింది. రష్యా దళాలు ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడికి పాల్పడగా.. అప్పటి నుంచి దాదాపు 2 మిలియన్ల మంది పిల్లలు నిరాశ్రయులయ్యారని కూడా పేర్కొంది. కాగా, ఈ వార్ ప్రారంభంలోనూ ప్రియాంక స్పందించింది. రష్యా దాడిని వ్యతిరేకింది. ‘భయంకరం’ అంటూ అప్పటి పరిస్థితిని వర్షించింది.
