ప్రియాంక చోప్రా 'ది వైట్ టైగర్' రివ్యూ

పులులలో తెల్ల పులులు వేరు. వైట్ టైగర్స్ చాలా అరుదుగా కనిపిస్తాయి. సాధారణంగా ఇవి అడవుల్లో కనిపించవు. అరుదైనవి కాబట్టే వైట్ టైగర్స్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అవి జన్యు లోపంతో పుట్టినా, ప్రత్యేక ఆకర్షణతో మెరిసిపోతూంటాయి. జూలకు వెళ్లే వారిని వైట్ టైగర్స్ ఎక్కువగా ఆకర్షిస్తాయి. దీంతో కొన్ని సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శనశాలలు  వైట్ టైగర్స్ సంతానోత్పత్తికు కృషి  చేస్తాయి. అయితే అది అన్ని సార్లూ సాధ్యం కాదు. అలాగే మనుష్యుల్లోనూ వైట్ టైగర్స్ అనదగ్గ వాళ్లు ఉంటారు. ఎప్పుడో జనరేషన్ కు ఒకరు అరుదుగా పుట్టి అందరి దృష్టినీ ఆకర్షిస్తారు. అందరికన్నా భిన్నంగా ఉంటారు. అలాంటి ఓ వైట్ టైగర్ లాంటి వ్యక్తి కథ ఇది. నవలగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కథ ఇప్పుడు సినిమాగా మన ముందుకు వచ్చింది. ప్రియాంక చోప్రా తన భర్తతో కలిసి నిర్మించిన ఈ సినిమాలో ప్రత్యేకత ఏమిటి..వైట్ టైగర్ గా మారిన ఆ వ్యక్తి ఎవరు..అతని కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.  

Priyanka Chopra  The White Tiger movie review jsp

“భారతదేశంలో రెండు రకాల జనం ఉన్నారు. ఒకరు పెద్ద పొట్ట ఉన్నవాళ్లు, వేరకరు చిన్న పొట్ట ఉన్నవాళ్లు.  నేను ఇరుక్కుపోయాను.” అంటూ  బ‌ల్ రామ్ హ‌ల్వాయ్ (ఆదర్శ్ గౌరవ్) తన విజయ గాధను వివరిస్తూంటాడు. అతను ల‌క్ష్మ‌ణ్ గ‌ఢ్ (రాజ‌స్థాన్‌)గ్రా‌మానికి చెందినవాడు. అతని తండ్రి చిన్నప్పుడే చనిపోతాడు. నాయనమ్మ ఆ కుటుంబాన్ని నియంతలా సాకుతూంటుంది. ఆమె మాటతో చిన్నప్పుడే చదువు మానేస్తాడు. పనిలో పడతాడు. అయితే ఓ రోజు అశోక్(రాజ కుమార్ రావు)ని, అతని స్టైల్ ని, ఐశ్వర్యాన్ని చూసాక తన జీవితంలో మార్పు రావాలంటే అతని దగ్గర డ్రైవర్ గా చేరాలనుకుంటాడు. అశోక్ తన భార్య పింకీ (ప్రియాంక చోప్రా) తో కలిసి ఇక్కడ బిజినెస్ చేయాలని ప్లాన్స్ చేస్తూంటాడు. పింకీ అమెరికా నుంచి ఈ మధ్యనే వచ్చింది. అక్కడ ఆలోచనలు ఆమె ను ఇంకా వదలవు. 

ఆ కోణంలోనే ఈ దేశాన్ని ఇక్కడ పరిస్దితులను చూస్తూంటుంది. వాళ్ల కాళ్లపై పడి డ్రైవర్ ఉద్యోగం సంపాదిస్తాడు బలరామ్.  చుట్టూ ఉన్న సమాజం,కుటుంబం అప్పటికే బల్ రామ్ ని సర్వెంట్ గా ఉండటానికి మానసికంగా ట్రైనింగ్ ఇచ్చేయటంతో ఈజీగానే అక్కడ ఎడ్జెస్ట్ అయ్యి..వాళ్ల మన్ననలు పొందగలుగుతాడు. అయితే ఆ డబ్బున్న వాతావరణం ..ఈ పుట్టు పేదోడిలో కొత్త ఆశలు,ఆలోచనలు రేకిస్తూంటుంది. అయితే అతనిలోని పనోడు మనస్తత్వం, అందులోంచి వచ్చే నిజాయితీ అతన్ని తల వంచుకుని పనిచేసుకుపోయేలా చేస్తాయి. తన జీతం, జీవితం,యజమాని, యజమానురాలు అన్ని బాగున్నాయి అని ఆనందపడుతున్న సమయంలో ఓ ఊహించని సంఘటన జరుగుతుంది. 

ఆ రోజు పింకీ పుట్టిన రోజు. ఆమె కొద్దిగా డ్రింక్ చేసి తనే కారు డ్రైవ్ చేస్తానని పట్టుపడుతుంది. దాంతో ఆమెను డ్రైవింగ్ సీట్లో కూర్చోపెట్టి ..తను వెనుక కూర్చుంటాడు బలరామ్. అయితే అదే అతను చేసిన పొరపాటైపోతుంది. ఆమె విపరీతమైన స్పీడు డ్రైవింగ్ తో ఓ యాక్సిడెంట్ చేసేస్తుంది. తర్వాత పరిణామాలు చకచకా జరిగిపోతాయి. బలరామ్ ని ఆ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తారు అశోక్ అన్నయ్య, తండ్రి. అందుకోసం బలరామ్ చేత కన్ఫెషన్ లెటర్ రాయించి సంతకం పెట్టించుకుంటారు. బలరామ్ తన చుట్టూ జరుగుతున్న కుట్రకు లోలోపలే మండిపడతాడు. కాని పైకి నేను సంతకం పెట్టను, నేను ఇరుక్కోను అని ధైర్యంగా తప్పుకోలేడు...అలాంటి తన బానిస మనస్తత్వం అతనికే ఆ తర్వాత అసహ్యం వేస్తుంది. అక్కడ నుంచి బలరామ్ ఆలోచనలలో పూర్తి మార్పు వస్తుంది. ఓ రకమైన తెగింపు. యజమానులపై కోపం, కసి పుట్టుకొస్తాయి. ఆ క్రమంలో బలరామ్ ఏం నిర్ణయం తీసుకున్నాడు..అతని జీవితం చివరకు ఏ మలుపు తీసుకుంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 
కథా విశ్లేషణ

‘తెల్లవాళ్ల రోజులు అయ్యిపోయాయి...ఇప్పుడు బ్రౌన్ ,యల్లో జాతి జనాలదే రాజ్యం' అంటూ అమెరికా ఆధిపత్యానికి చెల్లు చీటి పడిందని, ఇక ఆసియా దేశాలైన ఇండియా, చైనాలే ప్రపంచాన్ని ఏలుతాయని జోశ్యం చెప్తూ  'ది వైట్ టైగర్' వచ్చింది. ప్రముఖ ఇండో–ఆస్ట్రేలియన్‌ రచయిత అరవింద్‌ అడిగి ఇదే టైటిల్ తో రాసిన నవలకు తెరానువాదంగా ఈ సినిమా మన ముందు ప్రత్యక్ష్యమైంది. మన దేశంలోని కుల,మతాల చుట్టూ తిరిగే మనష్యుల మనస్తత్వాలను ఎండగట్టే ప్రయత్నం చేసింది. ది వైట్ టైగ‌ర్ న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్ల‌ర్ గా నిలిచింది. 2008లో మ్యాన్ బుక‌ర్ ప్రైజ్ గెలుచుకుంది. 

మాములుగానే నవలలను తెరకెక్కించాలంటే అందుకు చాలా కసరత్తు చేయాలి. అక్షరాలను విజువల్స్ గా మార్చటానికి కష్టపడాలి. అందులోనూ ప్రజాదరణం పొంది, అవార్డ్ లు గెలుచుకున్న నవల ఆ స్దాయి నవలలను స్క్రీన్ ప్లే రాసి తెరకెక్కించటం అంటే మాటలు కాదు. ఏ మాత్రం తెరానువాదం లో తేడా వచ్చినా విమర్శలు వస్తాయి. ఇవన్నీ డైరక్టర్ దృష్టిలో పెట్టుకునే జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కించారనిపిస్తోంది. అయితే ఆ మధ్య ఆస్కార్ సాధించిన కొరియా చిత్రం పారసైట్ ...ఈ సినిమా చూస్తుంటే గుర్తుకు రావటం జరుగుతుంది. అది యాధృచ్చికమే కావచ్చు కానీ ఆశ్చర్యం వేస్తుంది. పేద, ధనిక తేడాలు, ఒక డబ్బున్న వారి ఇంట్లో డ్రైవర్ గా చేరటం, కొన్ని సంఘటనలు పారసైట్ ని గుర్తు చేస్తాయి. 

 ఈ సినిమాని ఫన్ అనలేము కానీ ఎక్కడా తల తిప్పకుండా ఎంగేజ్ చేయటంలో మాత్రం డైరక్టర్ సక్సెస్ అయ్యాడు.  ఇక ఈ నవల వచ్చేనాటికి అంటే 2008లో బెంగళూర్ (ఇప్పుడు బెంగళూరు)లో స్టార్టప్ లు మొదలవుతున్న కాలం. ఏదనా కొత్తగా చేయాలనుకునేవారు అక్కడ చేరేవారు. అయితే ఇప్పుడు పరిస్దితులు మారాయి. కేవలం బెంగళూరు మాత్రమే కాకుండా దేశంలో చాలా చోట్ల ఐటీ హబ్ లు వచ్చేసాయి. కాబట్టి సినిమాలో అశోక్ పాత్ర బెంగళూరు వెళ్లాలి..స్టార్టప్ స్టార్ట్ చేయాలంటే కాస్తంత ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటివి సరిచూసుకోవాల్సింది. అలాగే సినిమా మొత్తం వాయిస్ ఓవర్ నేరేషన్ లో నడిపారు. అయితే పదే పదే కథ మధ్యలో వాయిస్ ఓవర్ వచ్చేస్తూంటే విసుగొచ్చింది. తెరపై కనపడతున్న విషయాలని మళ్లీ బలరామ్ నోటి ద్వారా చెప్పించాల్సిన పనిలేదనిపిస్తుంది. 

నటీనటుల్లో ప్రియాంక చోప్రా ఓ రెబల్ గా అమెరికా నుంచి ఇక్కడ పరిస్దితులకు ఇమడలేని వ్యక్తిగా ఓ రేంజి ఫెరఫార్మన్స్ చేసింది. ఇక రాజ్ కుమార్ రావు గురించి కొత్తగా చెప్పుకునేదేమీలేదు. ఇక  ఆదర్శ్ గౌరవ్.. అలా అలవోకగా చేసుకుంటూపోయాడు. ఎంత సహజంగా చేసాడంటే సినిమా చూడటం పూర్తైనా చాలా సేపు అతని ఫేస్, నవ్వు గుర్తు వస్తుంది. హీరో  నాయనమ్మ గా చేసిన కమలేష్ గిల్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే.  మరో కీలకమైన పాత్రలో మహేష్ మంజ్రేకర్ తనకు అలవాటైన విలనీని ప్రదర్శించారు.


టెక్నికల్ గా

 హాలీవుడ్ దర్శకుడు రమిన్ బహ్రాని (Man Push Cart ,Goodbye Solo, Fahrenheit 451) ఈ సినిమాని మంచి స్టాడర్ట్స్ లో తీసారు. దేశంలోని కుల వ్యవస్ద మీద, మతాలు కు ఇచ్చే ప్రయారిటీ మీద, పేద,ధనిక వర్గ తారతమ్యాల మీదా సెటైర్స్ వేసే ప్రయత్నం చేసారు. అయితే ఆ సెటైర్స్ కొన్ని మారుతున్న పరిస్దితుల ని మాత్రం అద్దం పట్టకపోవటం విచారకరం అనిపిస్తుంది. ఎందుకంటే పుస్తకం వచ్చిన ఈ పన్నెండేళ్లలో దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అవి కూడా పరిగణనలోకి తీసుకోవాల్సింది. నవీన భారతాన్ని అయితే రిప్రజెంట్ చేయలేకపోయారు. ఇంక మన తెలుగు కమర్షియల్ సినిమాల్లో విలన్స్ ని చూపెట్టినట్లే నెగిటివ్ పాత్రలు ఉన్నాయి. అలాగే సినిమాలో కీలకమైన బలరామ్ ఎదుగుదల కూడా సహజంగా ఉన్నట్లు అనిపించదు. చాలా హడావిడిగా ఉంటుంది. ఎలా ఎదిగాడు అనేది చూపెడదాము అని కథ మొదలెట్టినప్పుడు ఆ సీన్స్ పై కొద్దిగా కాన్సర్టేట్ చేసి ఉంటే బాగుండేది. హత్య చేసి తప్పించుకోవటం కూడా అసహజంగా అనిపిస్తుంది. ఇక టెక్నీషియన్స్ లో కెమెరా, ఎడిటింగ్, రీరికార్డింగ్ వంటివి అన్ని  ఫెరఫెక్ట్ గా సినిమా కథకు సింక్ అయ్యాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా బాగున్నాయి. 

ఫైనల్ ధాట్
 
వైట్ టైగర్ మన మధ్యా ,మనలోనూ ఉందేమో చెక్ చేసుకునేందుకు ఆ లక్షణాలను పరిచయం చేస్తుంది. 
 -సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:3

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios